టిటిడి గోడౌన్‌ను పరిశీలించిన ఛైర్మెన్‌ 

సరుకుల నాణ్యత, తూనికలపై పరిశీలన
తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శ్రీవారి భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలలో ఉపయోగించే ముడి సరుకులను టిటిడి ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పరిశీలించారు. తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ఛైర్మన్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మెన్‌ విూడియాతో మాట్లాడుతూ స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించే ముడిసరుకుల ఎంపిక, ఏజెన్సీ ఖరారు, ప్రయోగశాలలో వంటసామాగ్రి నాణ్యతా ప్రమాణాల పరిశీలన తదితర అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత టిటిడిలో ఉన్న నిబంధనల ప్రకారము టెండర్ల ద్వారా సేకరించి గోడౌన్‌లో నిల్వ ఉంచుతామన్నారు. గోడౌన్‌లో ఉన్న ముడి సరుకులు ఎలా ఉంది, తూనికలు, కొలతలు సక్రమంగా ఉన్నాయా, నాణ్యత తదితర అంశాలను పరిశీలించామన్నారు. బియ్యం, అందుకు ఉపయోగించే బ్యాగ్‌ బరువును పరిశీలించానని, టిటిడి నిబంధనల ప్రకారం తూనికలు పాటించారన్నారు. ఇటీవల విూడియాలో ముడి సరుకుల తూనికలు, కొలతలపై వచ్చిన వార్తలలో వాస్తవం లేదన్నారు. గోడౌన్‌ చుట్టూ అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, టిటిడి రెగ్యులర్‌ భద్రత సిబ్బందిని సెక్యూరిటీకి ఉపయోగించాలని తిరుపతి విజీవో అశోక్‌ కుమార్‌ గౌడ్‌ను ఆదేశించారు. ముందుగా జీడిపప్పు, ద్రాక్ష, బియ్యం, చక్కెర, కలకండ, చింతపండు, బెల్లం, టెంకాయలు, ఉద్దిపప్పు, ఇతర పప్పు ధాన్యాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ జగదీశ్వర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ అధికారులు  నాగరాజ, వెంకటముని, ఏవిఎస్‌వో  సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.