టీఆర్ఎస్ కు పరాభవం తప్పదు
– టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
– గాంధీభవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం
హైదరాబాద్, సెప్టెంబర్17(జనంసాక్షి) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం టీఆర్ఎస్ కు, కేసీఆర్‌కు ఇష్టం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన వారి కోసం స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. వేరుగా ఉన్న తెలంగాణను ఆనాడు భారతదేశంలో కలిపింది కాంగ్రెస్సేనని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, తెరాసకు ఘోర పరాభవం తప్పదని ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. వ్యతిరేక ఓట్లను తొలగించి ఎన్నికల్లో గెలుపొందాలని తెరాస చూస్తోందని, వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. మద్యం అమ్మకాలు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఏపీలో అధికారంతో పాటు ఎంపీ స్థానాలు కోల్పోతామని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా వ్యవహరించిందని ఉత్తమ్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ల నాటకంతోనే ముందస్తు ఎన్నికలు వచ్చాయన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. మోదీకి ఓటేసినట్లేనని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.