‘టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి’
– అబద్దాలు చెబుతూ బతికే పార్టీ టీఆర్‌ఎస్
– భాజపా అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం
– భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
– భాజపా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన దినం
– పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, సెప్టెంబర్17(జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సెప్టెంబరు 17ను పురస్కరించుకుని నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ బతికే పార్టీ టీఆర్‌ఎస్ అని ఆరోపించారు. బలిదానాల పునాదుల విూద ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ భోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రాబందుల సమితి అని.. ఎద్దేవా చేశారు. అధికారికంగా నిర్వహించాల్సిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేవలం మజ్లీస్ పార్టీ కారణంగా నిర్వహించలేకపోతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఏ పార్టీకి అధికారికంగా నిర్వహించే దమ్ము లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారికంగా నిర్వహిస్తాం. సర్ధార్ పటేల్ లేకపోతే ఈ రోజు తెలంగాణ ఉండేదా.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ కు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలందరూ నడుంబిగించాలని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అనంతరం
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే భాజపాతోనే సాధ్యమన్నారు. తెలంగాణకు స్వాతంత్యంత్య్రం వచ్చిన రోజును తెరాస ప్రభుత్వం జరపకపోవడం దారుణమన్నారు. భాజపా అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విమోచన దినాన్ని అధికారికంగా జరిపిస్తామని కిషన్‌రెడ్డి హావిూ ఇచ్చారు. తెరాస నేతలు ఉద్యమ సమయంలో ఒకలా… అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు హావిూలిచ్చి నెరవేర్చని నేతగా కేసీఆర్ నిలిచారని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటాల గడ్డ అని అన్నారు. నిజాం పాలనకు వ్యతరేకంగా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినం గురించి మాట్లాడే హక్కు కమ్యూనిస్టులకు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి తెలియనివారు ఇది విమోచనం కాదు.. విలీనం అని అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చింది తెరాస కాదని, ఆ పార్టీకి విమోచనం జరిపే ధైర్యం లేదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహిస్తామన్నారు.