టీడీపీకి గుణపాఠం తప్పదు


– ప్రధాని సభతో చంద్రబాబులో వణుకు మొదలైంది
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబానాయుడు మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నాడని, టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆయన గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబు ఆంధ్రుల పరువు తీశారని దుయ్యబట్టారు. ఏపీకి రూ.10 లక్షల కోట్లు ఇచ్చామని గడ్కరీ లెక్కలు చెప్పారని, చర్చకు రావాలని సవాల్‌ చేస్తే చంద్రబాబు ముందుకు రాలేదన్నారు. యూటర్న్‌ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఏపీలో దూరం పెట్టారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మా ప్రధాని సింహం అని అన్నారు. ప్రధాని భార్యపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిలా బాబు మాట్లాడుతున్నారని. ఆంబోతులా కొడుకు లోకేష్‌ని ప్రజలపైకి వదిలేశారన్నారు. టీడీపీ నేతలు కుక్కల్లా బీజేపీపై విరుచుకుపడుతున్నారని అన్నారు. నిన్న ప్రధాని సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందన్న కన్నా.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజలు తరలివచ్చారని చెప్పారు. కేంద్రం ఏం చేసిందో చెబుతున్నా కంఠశోషగా మారిందని.. ఏవిూ చేయలేదని బాబు చెబుతుంటే అదే హైలైట్‌ అవుతోందని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ కలిసి ఎయిమ్స్‌, ఎయిర్‌ పోర్ట్‌, జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో కవిూషన్‌ తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే బాబు ఒక్కరే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప రాష్ట్ర అభివృద్ధి చేశారా? అని ఆయన నిలదీశారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆహ్వానించటానికి కనీసం ప్రొటోకాల్‌ పాటించలేదని మండిపడ్డారని విమర్శించారు.