టీడీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తుంది

– అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని ఎందుకు పూర్తిచేయలేదు?
– తెలుగు రాష్ట్రాలు అవినీతిలో పోటీపడుతున్నాయి
– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు
విజయవాడ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : ఏపీలో టీడీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కులపేరుతో రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..  ఆంధప్రదేశ్‌లో టీడీపీ చేస్తోన్న కుల రాజకీయాలపై.. ఆ పార్టీపై వస్తోన్న అవినీతి ఆరోపణల నిర్థారణకు చంద్రబాబు సిద్ధమా అని జీవీఎల్‌ సూటిగా ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపవేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్‌ కార్యక్రమానికి తెర తీశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ జీవీఎల్‌ చేశారు. హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు.. నాలుగేళ్లలో అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కోతల రాయుడు చంద్రబాబు.. అమరావతి నీ పక్కి రాజకీయాలు చేస్తూ.. అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ నాయకులు దొంగ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్‌ నాయకులు విభజన చట్టం తయారయ్యే రోజున నిద్ర పోయారా అంటూ జీవీఎల్‌ ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడదామని చంద్రబాబు కేసీఆర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. రెండు తెలుగు రాష్టాల్రు అభివృద్ధిలో కాకుండా అవినీతిలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.విషయంలో చెప్పింది కొండంత అయితే చేసింది మాత్రం గోరంత కూడా లేదని ఎద్దేవా చేశారు.