టీడీపీ నేతలకు వణుకెందుకు

– కేంద్ర దర్యాప్తు అనగానే సీఎం ఎందుకు వణుకుతున్నారు
– ఢిల్లీ వెళ్లి చంద్రబాబు భంగపడ్డారు
– బిజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు
విజయవాడ, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : జగన్‌పై హత్యాయత్నం కేసుపై కేంద్ర దర్యాప్తు అనగానే టీడీపీ
నేతలు వణుకుతున్నారని, విూకు సంబంధం లేనిది అంత ఉలుకు, వణుకు ఎందుకని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు టీడీపీ నేతలను ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి హడావుడి చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డారని ఎద్దేవా చేశారు. సీఎం పదేపదే అబద్దాలు చెబతున్నారని, ఢిల్లీలో కూడా అసత్యాలే చెప్పారన్నారు. అక్కడ మాట్లాడిన మాటలు అసహ్యంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని జాతీయ విూడియా ముందు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలామాట్లాడితే అబద్దాల బాబుగా నిలిచిపోతారన్నారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిపై సీఎం స్పందన విచిత్రంగా ఉందని తెలిపారు. విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ లో జరిగిన సంఘటనంటూ కేంద్రంపై నెట్టేశారని, కేంద్రం ఏ విచారణ అయినా చేసుకోవచ్చని చెప్పారని, ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ కేంద్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీకి వెళ్లగానే చంద్రబాబు మాటమార్చరని మండిపడ్డారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో నిందితుడు ప్రతిపక్ష నేతను చంపడానికే దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారని, మరి అంతకు ముందు సీఎం చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏంటని ప్రశ్నించారు. కావాలనే విచారణను ప్రభావితం చేయడానికి, దారి మళ్ళించేందుకే రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏ సమాచారంతో మాట్లాడారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ పై జరిగిన హత్యాయత్నంలో ఆయన చనిపోతే ఎవరికి లాభం జరుగుతుందని, ఎవరు చేయించారు… ఎలా చేశారనేవే ఈ ఘటనలో కీలకమన్నారు. వీటిని పక్కనపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు ఊబిలో చంద్రబాబు కూరుకుపోతున్నారని జీవీఎల్‌ పేర్కొన్నారు.