టీమిండియా ఇక ఇంటికి
ప్రపంచ కప్ ఆరంభమయ్యే సమయానికి భారత్పై పెద్దగా అంచనాల్లేవు. క్వార్టర్స్ చేరితే గొప్పన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ప్రపంచ కప్లో ధోనీసేన వీటన్నంటినీ పటాపంచలు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో పుంజుకుని అద్భుతాలు చేసింది. బ్యాటింగ్ లైనప్ గాడిన పడగా.. బౌలింగ్ విభాగం పటష్టమైంది. ధోనీసేన రికార్డు విజయాలతో జైత్రయాత్ర సాగించింది. లీగ్ దశలో ఆరు మ్యాచ్ల్లోనూ నెగ్గింది. క్వార్టర్స్లోనూ ఇదే జోరు కొనసాగించింది. ఈ ఏడు మ్యాచ్ల్లోనూ 70కి 70 వికెట్లు పడగొట్టి ధోనీసేన చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్, వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల పుటలకెక్కింది. ఇక ప్రపంచ కప్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ధోనీసేన (భారత్ తరపున) మరో రికార్డు నెలకొల్పింది. గత ప్రపంచ కప్లో నాలుగు, తాజా ఈవెంట్తో కలిపి టీమిండియా ఈ రికార్డు సాధించింది.
భారత్ ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి టీమిండియా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టింది. ఆ మరుసటి మ్యాచ్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాపై అంచనాలకు మించి రాణించింది. సఫారీలపైనా మనోళ్లు ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత భారత్కు ఎదురేలేకుండా పోయింది. వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ, జింబాబ్వేలపై తిరుగులేని విజయాలు నమోదు చేసింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో నెగ్గి గ్రూపు-బి టాపర్గా భారత్ నిలిచింది. లీగ్ దశలో ఓటమెరుగని జట్లు టీమిండియా, కివీస్లు మాత్రమే. ఇక క్వార్టర్స్లో బంగ్లాదేశ్పై అదే జోరు కొనసాగించింది. కాగా ఆసీస్తో సెమీస్ పోరులో ఓడిపోవడంతో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
భారత్ కు భంగపాటు.. ఫైనల్లో ఆసీస్
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేకు పడింది. ఆసీస్ కు పేస్ కు ధోని సేన దాసోహమైంది. ప్రపంచకప్ నుంచి భారత్ నిష్ర్కమించింది. సెమీస్ పోరుతో కంగారూల చేతిలో భారత్ కు భంగపాటు ఎదురైంది. ఆతిథ్య జట్టు ఫైనల్ చేరగా, టీమిండియా ఇంటిముఖం పట్టింది. గురువారమిక్కడ సిడ్నీ మైదానంలో జరిగిన సెమీస్ సమరంలో భారత్ ను ఆస్ట్రేలియా 95 పరుగుల తేడాతో ఓడించింది. 329 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ధోని సేన36.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది.
ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు ధావన్, రోహిత్ 76 పరుగుల శుభారంభం అందించారు. ధావన్ ధాటిగా ఆడాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 45 పరుగులు చేసి తొలి వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లి(1) వెంటనే అవుటయ్యాడు. కొద్ది సేపటికే రోహిత్(34), రైనా(7) అవుటవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ దశలో రహానే, ధోని జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 178 పరుగుల వద్ద రహానే(44) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ధోని అర్ధసెంచరీ ఒంటరి పోరాటం చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ధోని 65 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి రనౌటయ్యాడు. అంతకుముందు జడేజా(16) రనౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్ 3 జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు స్మిత్(105) సెంచరీ, ఫించ్(81) అర్థసెంచరీలతో రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలపడతాయి.
చివరకు ఆతిథ్య జట్లే మిగిలాయి
ప్రపంచ కప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా పోరాటం ముగిసింది. హాట్ టైటిల్ ఫేవరెట్ దక్షిణాఫ్రికా అంతులేని వేధనతో నిష్ర్కమించింది. మాజీ చాంప్స్ వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టాయి. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అయితే లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. 14 జట్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో చివరకు ఆతిథ్య జట్లే టైటిల్ రేసులో మిగిలాయి. ఈ నెల 29న మెల్బోర్న్లో జరిగే గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆసీస్ ఇప్పటి వరకు 4 ప్రపంచ కప్లు గెలవగా, కివీస్ తొలిసారి ఫైనల్ చేరింది. తాజా ఈవెంట్లో ఈ రెండు జట్లూ గ్రూపు-ఎలో ఆడాయి. లీగ్ దశలో కివీస్.. ఆసీస్ను ఓడించింది. కివీస్ ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరగా, ఆసీస్ ఓ మ్యాచ్లో మాత్రం ఓడింది. ఆరు లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గిన కివీస్ క్వార్టర్స్, సెమీస్లోనూ సంచలన విజయాలు సాధించింది. అయితే ఈ మ్యాచ్లన్నీ స్వదేశంలో, చిన్న మైదానాల్లో జరిగాయి. ఫైనల్ సమరం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతోంది. ఫైనలిస్టులు ఆసీస్, కివీస్ సమవుజ్జీలుగా కనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ కొత్త చాంపియన్గా అవతరిస్తుందా? లేక ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలస్తుందా అన్న విషయం 29న తేలనుంది. ఏదేమైనా ఆతిథ్య జట్టే ప్రపంచ చాంపియన్ కాబోతోంది.