టెక్‌ మహీంద్రాతో మహీంద్రా సత్యం విలీనం పరిపూర్ణం

ఢిల్లీ : మహీంద్రా సత్యం సంస్థ టెక్‌ మహీంద్రాతో విలీన ప్రక్రియ అధికారికంగా మంగళవారం పరిపూర్ణమైంది. దీంతో టెక్‌ మహీంద్రా దేశంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఐదో పెద్ద సంస్థగా అవిర్భవించింది. ఈ విలీన ప్రక్రియ గత నాలుగేళ్లుగా జరుగుతోందని, చట్టపరమైన, ఇతర అంశాలపై పలు బృందాల నిపుణులు కృషిచేసి షేర్‌హోల్డర్లకు తగిన విలువ లభించేలా చూశారని టెక్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ తెలిపారు. ఈ రెండు సంస్థల బోర్డులు మార్చి 21న విలీనానికి పచ్చజెండా వూపాయి. ముంబయి హైకోర్టు అనుమతి కూడా లభించింది. దాంతో అధికారికంగా నేడు విలీనం పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సంస్థ సీఎఫ్‌ఓగా మిలింద్‌ కులకర్ణి బాధ్యతలు నిర్వహిసారని వినీత్‌ నయ్యర్‌ తెలిపారు. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న టెక్‌మహీంద్రాకి మొత్తం 84 వేల మంది సిబ్బంది ఉన్నారు. 46 దేశాల్లో 540 మంది క్లయింట్లున్నారు.