ట్రిపుల్‌ ఐటికి ఆధునిక హంగులు

అందుబాటులోకి ఆధునిక నిర్మాణాలు

విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నూజివీడులోని ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటిలో కొత్త హంగులు సంతరించు కుంటున్నాయి. కొద్ది రోజుల్లో పలు సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వ విద్యాలయాలకు ఉండే అన్ని సౌకర్యాలూ ట్రిపుల్‌ ఐటిలో ఉండేందుకు ఆర్‌జియుకెటి ఉన్నతాధికారులు నిర్మాణ చర్యలు చేపడుతున్నారు.ఈ కొత్త హంగులు ప్రత్యేక ఆకర్షణ అవడంతో పాటు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది.ప్రస్తుత కాలానికి అనుగుణంగా అత్యంత సుందరమైన అవసరమైన సదుపాయాలు ఉండే డిజిటల్‌ లైబ్రరీతో పాటు స్టూడెంట్‌ యాక్టివిటి సెంటర్ల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. గత ప్రభుత్వ హాయాంలో 33 కోట్ల రూపాయల నిధులతో డిజిటల్‌ లైబ్రరీ, స్టూడెంట్‌ యాక్టివిటి సెంటర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతంపనులు పూర్తయ్యాయి. నిర్మాణం జరుగుతున్న డిజిటల్‌ లైబ్రరీ అందుబాటులోకి వస్తే ఆరు వేల మంది సాంకేతి విద్యార్థులకు విలువైన మెటిరియల్‌ అందుబాటు లోకి వస్తుంది. ఎనిమిదేళ్లుగా కొరతగా ఉన్న లోటు త్వరలో తీరబోతుంది. విద్యార్థులు ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్టూడెంట్‌ యాక్టివిటి సెంటర్‌ నిర్మాణం జరుగుతుంది. ఈ సెంటర్‌లో ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహణకు సదుపాయాలు ఉన్నాయి. బాలురకు బాలికలకు వేరు వేరుగా షటిల్‌ కోర్టులు ఏర్పాటు, యోగా సెంటర్‌, లాకర్స్‌ గది, పరిపాలన గదుల ఏర్పాటుతో పాటు సుమారు 600 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మాణం జరుగుతుంది. సెంటర్‌ పూర్తయితే ట్రిపుల్‌ ఐటి విద్యార్థులకు సంబంధించిన ఆయా కార్యక్రమాలను, ఆటల నిర్వహణకు ఎంతో దోహదపడుతుంది.