డబ్బు సరిపడా ఉంది
– నగదు కొరత ఏర్పడుతున్న వార్తలు అవాస్తవం
– స్పష్టం చేసిన ఆ
ముంబయి, సెప్టెంబర్27(జనంసాక్షి) : మార్కెట్లో నగదు కొరత ఏర్పడుతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ ఆర్‌బీఐ దీనిపై స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం డబ్బు సరిపడా ఉందని, మార్కెట్ పరిస్థితులను బట్టి దీర్ఘకాలానికి సరిపడా నగదును సమకూరుస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం ఆర్‌బిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 26నాటికి బ్యాంకుల వద్ద రూ.1.88లక్షల కోట్ల నగదు ఉందని, ప్రస్తుతానికి బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు సరిపడా ఉందని పేర్కొంది. దీర్ఘకాలం కోసం కూడా నగదును సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది. ఇందులో భాగంగానే సెప్టెంబరు 19న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్(ఓఎంవో) నిర్వహించామని పేర్కొంది. మరోసారి ఈ సెషన్ చేపట్టబోతున్నాంమని, ఈ చర్యల ద్వారా మిగులు ద్రవ్యం పుష్కలంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఇక స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి) సడలింపు కూడా అక్టోబరు 1, 2018 నుంచి అమల్లోకి రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఎస్‌ఎల్‌ఆర్ సడలింపు వల్ల బ్యాంకుల వద్ద నగదు లభ్యత ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఇటీవల ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో మార్కెట్‌లో నగదు కొరతపై ఆందోళలనలు మొదలయ్యాయి. దీంతో వీటిపై స్పందించిన ఆర్‌బీఐ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.