డిసెంబర్ లో వెయ్యి నోటు
కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. త్వరలోనే కొత్త వెయ్యి నోట్లకు రీ ఎంట్రీ ఇవ్వనుందట. ఇటీవల రూ.200 నోటును ప్రవేశపెట్టడంతో చిల్లర సమసస్యకు కాస్త ఊరటనిచ్చింది. RBI నివేదిక ప్రకారం 2017, డిసెంబర్ నాటికి కొత్త వెయ్యి నోట్లను కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.200, రూ. 500, రూ.2వేల నోట్ల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించటం కోసం వెయ్యి నోటును తిరిగి తీసుకురానున్నట్టు సమాచారం. మెరుగైన భద్రతా ప్రమాణాలు, కొత్త డిజైన్‌తో ఈ కరెన్సీ నోట్లను లాంచ్ చేయాలని భావిస్తోంది RBI. జాతీయ మీడియా రిపోర్టు ప్రకారం మైసూర్ ప్రింటింగ్ ప్రెస్ లో కొత్తగా వెయ్యి రూపాయల నోట్లను ముద్రించటానికి సిద్ధంగా ఉన్నారట. డిసెంబరు 2017 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయని నివేదించింది.
అయితే కేంద్ర బ్యాంకులు, RBI ముందు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది ఈ వార్త. ఫిబ్రవరి నెలలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. వెయ్యి రూపాయల నోటును తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మళ్లీ వెయ్యి నోటు రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై RBI అధికారికంగా స్పందించాల్సి ఉంది.