డెంగ్యూతో మంచాన పడుతున్న ప్రజలు


గిరిజన ప్రాంతాల్లో విపరీతంగా దోమలదాడి
పట్టణ ప్రాంతాల్లో పారిశుద్య లోపంతో పెరుగుతున్న దోమలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనం సాక్షి): ఇన్నాళ్లు కరోనా కలకలంతో ఆందోళనకు గురైన ప్రజలు ప్రస్తుతం డెంగ్యూ ఫివర్‌తో వణికిపోతున్నారు. వానకాల సీజన్‌ ప్రారంభం నుంచే ఈ సంఖ్య పెరుగుతోంది. గ్రావిూణ ప్రాంతాల కంటే అర్బన్‌ ప్రాంతంలోనే ఎక్కువగా కేసులు కనిపిస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో పారిశుద్య లోపం కారణంగా దోమల విస్తరణ ఎక్కువువుతోంది. దీంతో జిల్లాల్లో డెంగ్యూ కేసులు డేంజర్‌ స్థాయికి చేరుకుంటున్నాయి. పక్షం రోజుల్లోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాజిటివ్‌ కేసులను తక్కువగానే చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దోమకాటుకు డెంగ్యూ, మలేరియా పంజా విసరడంతో బాధితులు మంచం పడుతున్నారు. ఎడిస్‌ దోమ కాటుకు గురై అనారోగ్య బారిన పడుతూ తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజుల వ్యవధిలోనే రక్తకణాలు తగ్గిపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. వార్డులు, పంచాయతీల్లో నీటిని నిలువ ఉంచకుండా చూడడంతో పాటు ప్రతీ శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తు ఫాగింగ్‌, రసాయన మందుల పిచికారి, బ్లీచింగ్‌ పౌండర్‌ వంటివి నిరంతరం చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు చేపడితేనే ఎడిస్‌ దోమల వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది. కేసుల సంఖ్య పెరిగి పోవడంతో హడావిడి చేస్తున్నా ప్రయోజనం లేదు. డెంగ్యూ కేసులు పెరిగిపోవడంతోఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. డెంగ్యూ బాధితులతో పాటు మలేరియా బారిన పడిన వారంత ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాస్థాయిలో డెంగ్యూ వ్యాధి నిర్దారణ యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో జిల్లాల నుంచి బాధితుల రక్త నమునాలను సేకరించి పట్టణాలకు పంపుతున్నారు. వై ద్యం ఆలస్యమైతే ప్లేట్‌లేట్స్‌ పడిపోవడంతో ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యంపై భరోసా లేనివారందరూ హైదరాబాద్‌, వరంగలం, కరీంనగర్‌ నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. డెంగ్యూకు ఆరోగ్య శ్రీలో అవకాశం లేకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి నష్టపోతున్నారు. ఇటీవల కురుస్తున్న ముసురు వర్షాలకు దోమల ఉధృతి పెరిగిపోతుంది. ఏజెన్సీ గ్రామాల్లో దోమల నివారణకు దోమతెరలను పంపిణీ చేసినా వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో గిరిజనులు ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన
లేకపోవడంతోనే డెంగ్యూ కేసులు పెరిగి పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రావిూణ ప్రాంతాల కన్న పట్టణ ప్రాంతంలోనే ఎక్కువగా డెంగ్యూ కేసులు కనిపిస్తున్నాయి. అర్బన్‌ ప్రాంతంలో ఉన్న ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారులు ఎక్కడ దోమల నివారణకు చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదు. వెంటనే తగు చర్యలు తీసుకోకుంటే మరింతగా పెరిగే
ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేసి గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది.