ఢల్లీి ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు

` మద్యం కుంభకోణం కేసులో 8 గంటలపాటు విచారించి అనంతరం అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ అధికారులు
` నేను భగత్‌సింగ్‌ను అనుసరిస్తా: మనీశ్‌ సిసోడియా
` సీబీఐ విచారణకు ముందు ఢల్లీి ఉపముఖ్యమంత్రి ట్విట్‌
` మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌ డర్టీ పాలిటిక్స్‌..
` మండిపడ్డ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌
దిల్లీ(జనంసాక్షి):మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్టయ్యారు.ఇవాళ మధ్యాహ్నం సీబీఐ విచారణకు వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోదియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సిసోదియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దినేశ్‌ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్‌ కాల్స్‌ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మనీశ్‌ సిసోదియా సమాధానాలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని చెబుతున్నారు. సిసోదియా నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్‌ విచారణ అవసరమని అన్నారు.మరోవైపు సీబీఐ విచారణకు ముందు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ‘’నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి వచ్చినా.. లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని సిసోదియాకు ముందుగానే అర్థమైనట్లు తెలుస్తోంది.ఈ కేసులో సిసోదియాను సీబీఐ గతంలోనూ విచారించింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిసోదియా సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, సవిూర్‌ మహేంద్రు సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అటు ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇఆ) కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది.
నేను భగత్‌సింగ్‌ను అనుసరిస్తా: మనీష్‌ సిసోదియా
సీబీఐ విచారణకు ముందు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. దిల్లీ మద్యం కుంభకోణంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నించే ముందు ఓ ట్వీట్‌ చేశారు. ‘’నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సివచ్చినా.. నేను లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
సిసోదియా అరెస్టు ఊహించిందే..: ఆప్‌
మద్యం కుంభకోణం కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన్ను అరెస్టు చేస్తారని తమకు తెలుసని ఆప్‌ పేర్కొంది. సీబీఐ పూర్తిగా కేంద్రం ఆదేశాల మేరకే పనిచేస్తోందని దుయ్యబట్టింది. మనీశ్‌ను అరెస్టు చేస్తారని తమకు ఎప్పటినుంచో తెలుసని ఆప్‌ ఎమ్మెల్యే సురభ్‌ భరద్వాజ్‌ అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయో ముందే చెప్పగలిగే పరిస్థితులు ఉండటం విచారకరమన్నారు.మరోవైపు, మనీశ్‌ సిసోదియా అరెస్టు నియంతృత్వానికి పరాకాష్ఠగా ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అభివర్ణించారు. ‘’మోదీజీ.. విూరు మంచి మనిషిని, గొప్ప విద్యాశాఖ మంత్రిని అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఏదో ఒకరోజు విూ నియంతృత్వం అంతమవుతుంది’’ అని విమర్శించారు.
మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌ డర్టీ పాలిటిక్స్‌..: కేజ్రీవాల్‌
ఢల్లీి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అమాయకుడు అని ఢల్లీి సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. లిక్కర్‌స్కామ్‌ కేసులో మనీశ్‌ సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటలు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్‌ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. దీనిపై అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మనీశ్‌ సిసోడియా ను అరెస్ట్‌ చేయడం ద్వారా కేంద్రం మురికి రాజకీయాలు చేస్తున్నదని మండి పడ్డారు.‘ఆయన అరెస్ట్‌తో మురికి రాజకీయాలు చేస్తున్నారు. మనీశ్‌ సిసోడియా ను అరెస్ట్‌ చేయడంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందన్న విషయాన్ని గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి అంశాన్నిఅర్థం చేసుకుంటున్నారు. ప్రజలు దీనికి ప్రతిస్పందిస్తారు. ప్రజల స్పందనే మాకు మరింత స్ఫూర్తినిస్తుంది. మా పోరాటం మరింత బలోపేతం అవుతుంది‘ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.