ఢిల్లీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

– ఫొటోలు విడుదల చేసిన నిఘా పోలీసులు
– దేశరాజధానిలో హై అలర్ట్‌
న్యూఢిల్లీ, నవంబర్‌21(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు సమాచారం అందజేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులు ఢిల్లీలోకి ప్రవేశించారని, వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని హెచ్చరిస్తూ వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, తక్షణమే 011-23520787 లేదా 011-2352474 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు కోరారు. కాగా, పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఢిల్లీకి 360 కిలోవిూటర్లు, ఫిరోజ్‌పూర్‌కు 9 కిలోవిూటర్ల దూరంలో ఓ మైలురాయి వద్ద నలుపు, కాఫీ రంగు కుర్తాలు ధరించిన ఇద్దరు యువకులు ఉన్నారని, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ పట్టణం భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులకు అత్యంత సవిూపంలో ఉందని ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. పంజాబ్‌లో ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల అనంతరం ఐబీ హెచ్చరికలు చేయడంతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే మహమ్మద్‌కు చెందిన ఆరు లేదా ఏడుగురు ఉగ్రవాదుల బృందం పంజాబ్‌లోకి ప్రవేశించారని, ఇక్కడి నుంచి వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆ రాష్ట్ర పోలీస్‌ నిఘా విభాగం తెలిపింది. దీంతో పంజాబ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగర శివార్లలోని సంత్‌ నిరంకారి భవన్‌పై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రార్థనలు జరుగుతుండగా ఇద్దరు ఉగ్రవాదులు భక్తులపైకి గ్రెనేడ్‌ విసరడంతో ముగ్గురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడికి ముందు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ… 1980, 90ల నాటి తీవ్ర హింసాత్మక పరిస్థితుల నుంచి బయటపడి, ఇటీవలే శాంతి నెలకొన్న పంజాబ్‌లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.