ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కిరణ్‌

వాయలార్‌, చిదంబరంలతో భేటి
బొత్స సీటుకు ఎసరు ?
నేడు ప్రధాని, సోనియాతో భేటి
న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) :
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలతో గురువారం వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీకి చేరుకుని రాత్రివరకు అధిష్ఠానం పెద్దలతో భేటీలతో బిజిబిజీగా గడిపారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌, కేంద్ర ఆర్థికశాఖామంత్రి పి.చిదంబరంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. రాజకీయాలతోపాటు మంత్రి ధర్మాన విషయంపై కూడా ముఖ్యమంత్రి ఆయనతో చర్చించారు. అలాగే పనిలో పనిగా పీసీసీ చీఫ్‌ బొత్సను తప్పించాలని ఆయన వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కాబినెట్‌ మంత్రులు తనతో ధర్మాన విషయమై సమావేశమవ్వడం వారి వారి అభిప్రాయాలను కరాఖండీగా వివరించిన అంశాలను కూడా చిదంబరం దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్ళారు. అనంతరం ఆయన రక్షణ శాఖమంత్రి, మంత్రుల సాధికార బృందం అధినేత ఎకె.ఆంటోనీతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అయితే ఆంటోని మరో సమావేశానికి హజరవ్వాల్సి ఉన్నందున కేవలం 10-15నిముషాలు మాత్రమే ఆయనతో మాట్లాడగలిగారు.ఈ కొద్ది సమయంలోనే గ్యాస్‌, విద్యుత్‌ సమస్యలను ఆంటోని దృష్టికి తెచ్చారు. అదనపు కేటాయింపులు కోసం ముఖ్యమంత్రి ఆయనను అభ్యర్థించారు. అనంతరం ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్‌తో సమావేశమయ్యారు. అహ్మద్‌ పటేల్‌తో కూడా ఆయన బేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి కోర్‌ కమిటీ సభ్యులతో
వరుస భేటీలు నిర్వహిస్తూ తాజా పరిణామాలను వివరిస్తున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై కూడా ముఖ్యమంత్రి అధిష్ఠానం పెద్దల వద్ద ప్రస్తావిస్తూ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని సమాచారం.
రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ మార్పులపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో మార్పులకు రంగం సిద్ధమవుతుందనే వార్తలు వినబడుతున్నాయి. మరో వారం రోజులలో అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండురోజులుగా ఇక్కడ మకాం వేసి అధిష్ఠానం పెద్దలతో చర్చలు సాగిస్తున్నారు. ఇదే సందర్భంలో ధర్మాన ప్రసాదరావు విషయంలో ఏర్పడిన ధర్మ సంకటంపై పెద్దలకు వివరిస్తూనే రాష్ట్రంలో మార్పులు, చేర్పులు విషయంపై కూడా బొత్స ఆరా తీస్తూ, అధిష్ఠానం ఆలోచనను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధిష్ఠానం పెద్దలు కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలు పలువురితో వేరువేరుగా మాట్లాడారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ తరుణంలో అడిగిన రాష్ట్ర నేతలందరికి సమయాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చేపడితే ఎలా ఉంటుందన్న విషయంపై రాష్ట్ర నేతలనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో అమ్మదయ కోసం ఎదురు చూస్తున్న మాజీ మంత్రి శంకర్‌రావు సోనియాతో భేటీ అయ్యారు. మార్పులు చేయాల్సిందేనని వివరించినట్టు ఆయన భేటీ అనంతరం చెప్పారు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా సోనియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు ప్రభుత్వ, పార్టీ పనితీరుపై వీరిఇరువురి మధ్య చర్చ జరగినట్టు సమాచారం. అలాగే నాయకత్వ మార్పు పై కూడా చిరంజీవి నుంచి సోనియా ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవికి రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అంశంపై కూడా చర్చ జరిగిందని తెలుస్తుంది. పార్టీ అధిష్ఠానం ఏ బాద్యతలు అప్పజెప్పినా చేపట్టేందుకు సిద్ధమేనని చిరంజీవి ఇప్పటికి ప్రకటించిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు చిరంజీవి విముఖత వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. మరోవైపు ధర్మానను గండం నుంచి గట్టేక్కించేందుకు అదే జిల్లాకు చెందని ఎంపి కిల్లి కృపారాణి ఢిల్లీలో ఇతర నాయకులతో కలసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమె సోనియా గాంధీతో సమావేశమై ధర్మానను కాపాడాల్సిన ఆవశ్యకత వివరించారు. జిల్లాలో ధర్మాన గట్టి నాయకుడని అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం కూడా రాష్ట్ర పరిస్థితులపై సునిశిత దృష్టి పెట్టినట్టు సమాచారం. ధర్మాన వ్యవహారంలో ఎలా వ్యవహరించాలన్న విషయమై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతుంది. ధర్మాన కోణం నుంచే పరిశీలించాలా లేక మొత్తం వ్యవహారం అంతటిని కలిపి చూడాలా అనే విషయమై తర్జన భర్జన జరుగుతుంది. మొత్తం మీద ధర్మాన వ్యవహారంతో పాటు రాష్ట్రంలో మార్పు చేర్పుల విషయంలో మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ వర్గాలు చెబతున్నాయి. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదంటూ ముఖ్యమంత్రి వర్గీయులు చెప్పడం కోసమెరుపు.