ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాతావరణం

కృత్రిమ వర్షంతో అడ్డుకుంటామన్న కేంద్రమంత్రి

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఇదిలాగే కొనసాగితే కృత్రిమ వర్షం కురిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కేంద్ర మంత్రి మహేష్‌ శర్మ వెల్లడించారు. పరిస్థితి మరింత దిగజారితే కృత్రిమ వర్షం కురిపించాల్సిందిగా అధికారులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఆయన చెప్పారు. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు గాలి కాలుష్యం ఆందోళనకర విషయమే. కాలుష్యం స్థాయి 500 దాటితే క్లౌడ్‌ సీడింగ్‌ ద్వారా కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నం చేస్తాం. శాస్త్రవేత్తలు, అధికారులు అదే పనిలో ఉన్నారు అని మహేష్‌ శర్మ తెలిపారు.

మంగళవారం కూడా ఢిల్లీ దట్టమైన మంచు దుప్పటి గుప్పిట్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయి 352గా నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయిని సూచిస్తుంది. దీంతో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ వారంలోనే కృత్రిమ వర్షం కురిపించడానికి సిద్ధమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిల్వర్‌ అయోడైడ్‌, డ్రై ఐస్‌, ఉప్పుతోపాటు వివిధ రసాయన మిశ్రమాలను కలిపి ఇప్పుడున్న మేఘాలలోకి ఇంజెక్ట్‌ చేయడం ద్వారా కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నం చేస్తారు. 2016లోనే ఇలాంటి ఎ/-లానే వేసినా.. అప్పుడు వర్కవుట్‌ కాలేదు. గతేడాది హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లి దుమ్ము రేగకుండా చూడాలన్న ప్రతిపాదన కూడా చేసినా అదీ కార్యరూపం దాల్చలేదు.