ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో వెళ్ళేందుకు ఈ రహదారి మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు రెండున్నర గంటల సమయంలోనే తాజ్‌మహల్‌ సౌందర్యాన్ని వీక్షించవచ్చు లక్నో నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. 6లైన్లతో 165కిలోమీటర్ల పోడవుతో దాదాపు 12వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు రూపకల్పన జరిగింది. జైపి గ్రూప్‌ ఈ రహదారిని అభివృద్ధి చేసింది. గత మాయవతి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పథకానికి నేడు ప్రారంభోత్సవం జరగడం గమనార్హం. ఇదిలా వుండగా ప్రాజెక్టు వలన రైతులు నిర్వాసితులు అవుతున్నారని, వారికి న్యాయం చేయాలంటూ రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత అజీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో రైతులు, వర్కర్లు, బజ్నాజ్‌ గ్రామంలో ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారికి సంబంధించిన టోల్‌ ఫ్రీని కూడా నిర్ణయించింది. లైట్‌ మోటార్‌ వెహికల్స్‌కి కిలోమీటరుకు 2.10పైసలు చెల్లించాలి.