ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసు రహస్య విచారణ
మీడియాపై ఆంక్షలు కోర్టు హాల్‌లో ఉద్రిక్తత
న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి):
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా (ఇన్‌కెమెరా) సాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా (ఇన్‌కెమెరా) సాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. అత్యాచార కేసు విచారణ వార్తలపై విూడియా సంయమనం పాటించాలని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా విచారణ ప్రక్రియను ప్రచురించకూడదని మెట్రోపాలిటన్ మేజిస్టేట్ర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం సాకేత్ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో నిందితులు రామ్‌సింగ్, ముఖేశ్, పవన్‌గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను న్యాయమూర్తి నమ్రితా అగర్వాల్ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు చార్జిషీట్ ప్రతులను అందజేశారు. అంతకు ముందు సాకేత్ కోర్టులో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్ లాయర్లు, జర్నలిస్టులు, పోలీసులతో కిక్కిరిసి పోయింది. కోర్టు హాల్‌లో ఉన్న వారు బయటకు వెళ్తేనే విచారణ ప్రారంభిస్తానని న్యాయమూర్తి లేచివెళ్లిపోయారు. అయితే, అంతకు ముందు.. నిందితుల తరఫున వాదించేందుకు ఓ న్యాయవాది ముందుకు రాగా, దానిపై ఇతర లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్యాంగ్ రేప్ నిందితుల తరఫున వాదించకూడదని సాకేత్ బార్ అసోసియేషన్‌తో పాటు ఢిల్లీలోని ఇతర న్యాయవాద సంఘాలు కూడా నిర్ణయించాయి. అయితే, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓ లాయర్ నిందితుల తరఫున వాదించేందుకు తొలిసారిగా ముందుకు వచ్చారు. వాదనకు సిద్ధమైన న్యాయవాదిపై అక్కడి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాది మోహన్‌లాల్ శర్మ నిందితుల తరఫున తాను వాదిస్తానని మెట్రోపాలిటన్ మేజిస్టేట్ర్ నమ్రితా అగర్వాల్‌కు తెలిపారు. నిందితులను రక్షించేందుకు వారి తరఫున వాదించాలని వారి బంధువుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని ఆయన చెప్పారు. నిందితుల వారి తరఫున వాదించేందుకు సమర్పించాల్సిన ‘వకల్తానామా’పై వారి సంతకం తీసుకోలేదన్నారు. నిందితులు తీహార్ జైలులో ఉన్నందున తాను అక్కడికి వెళ్లలేదన్నారు. వారి తరఫున వాదించేందుకు అనుమతించాలని కోరారు. అయితే, ఆయన విజ్ఞప్తిని కోర్టును తిరస్కరించింది. మరో ఇద్దరు లాయర్లు వాదించేందుకు ముందుకు రాగా.. వారి సేవలను అమికస్ క్యూరీగా వినియోగించుకునేందుకు కోర్టు అంగీకరించింది.