తప్పిన ప్రమాదం!

– సింగపూర్‌ స్కూట్‌ విమానంలో పొగలు
– చెన్నై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండ్‌
హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : ప్రమాదం తప్పింది.. సింగపూర్‌ స్కూట్‌ విమానానికి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో పొగలు వచ్చాయి. దీనిని గమనించిన పైలట్‌.. అత్యవసరంగా చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారు జామున 3:40 గంటలకు ట్రిచీ ఎయిర్‌పోర్టు(తమిళనాడు) నుంచి సింగపూర్‌కు స్కూట్‌ ఎయిర్‌వేస్‌ విమానం బయల్దేరింది. కాసేపటికే విమానంలో పొగలు రావడంతో.. దీన్ని పైలట్‌ గమనించి చెన్నై ఎయిర్‌పోర్టు ఏటీసీకి సమాచారం అందించాడు. అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్‌ చేయాలని విజ్ఞప్తి చేయడంతో.. అందుకు ఏటీసీ అనుమతిచ్చింది. దీంతో విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు. ఈ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. విమానంలో పొగ రావడాన్ని ముందే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పిందని స్కూట్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సింగపూర్‌కు విమానం బయల్దేరే అవకాశం ఉంది. ప్రయాణికులకు స్థానిక ¬టల్‌లో వసతి ఏర్పాటు చేశారు. మరోవైపు నిపుణులు విమానాన్ని పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.