తిత్లీ తుపాన్‌తో భారీ నష్టం
గిరిజన సమస్యల పరిష్కారానికి చర్యలు
జడ్పీ ఛైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి
విజయనగరం,అక్టోబర్19(జనంసాక్షి): తిత్లీ తుఫాను కారణంగా పంచాయతీలోని పలు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జడ్పీ ఛైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి అన్నారు. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా తగిన విధంగా ఆదుకుంటామని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జడ్పీ ఛైర్‌పర్సన్ అన్నారు. ఆమె జరడా తుపాను బాధితులను పరామర్శించిన అనంతరం గుమ్మలక్ష్మీపురం మండలం, భద్రగిరి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటూ యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మాణ పనులను చేస్తున్నారన్నారు. కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, తదితర ప్రజాప్రతినిధులు జరడ పంచాయతీని సందర్శించడం జరిగిందన్నారు. తాను దసరా పండగ అయినా కూడా తుఫాను బాధితులను పరామర్శించి, వారి కష్ట, సుఖాల్లో పాలు పంచుకోవాలనే
ఉద్దేశ్యంతో జరడ గ్రామానికి జిల్లా పరిషత్ సీఈవో, జడ్పీటీసీలతో సహా రావడం జరిగిందన్నారు. బాధితులకు తమ వంతు సాయంగా వంటపాత్రలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తుపాను బాధితులు ఈ సందర్భంగా పలు సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చారని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకు వెళ్ళి పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. జరడా రోడ్డు అభివృద్ధికి ఉపాధి హావిూ నిధులతో పాటు ఇతర పద్దుల నుండి నిధులు సేకరించడానికి కృషి చేస్తానన్నారు. తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం పక్కా ఇళ్లను మంజూరు చేస్తుందని, ఆయా గ్రామాల్లోని మిగిలిన కుటుంబాలు కూడా తమ ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయని, తమకు పక్కా ఇళ్లను మంజూరు చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఈ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తామన్నారు. జిల్లాలో ఉన్నత పాఠశాలలకు ఫర్నిచర్ అందిస్తున్నామన్నారు. జూనియర్ కళాశాలలకు భవన నిర్మాణాలు కూడా మంజూరయ్యాయని, ఆయా పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే, కురుపాం నియోజకవర్గానికి త్రాగునీటి పథకాలకు గాను 110 కోట్ల రూపాయలను మంత్రి నారా లోకేష్ మంజూరు చేశారని, ఈ పనులు త్వరితగతిన ప్రారంభిస్తారని తెలిపారు.