తిత్లీ బాధితులకు.. కేంద్రం నిధులు విడుదల చేయాలి
– ఇలాంటి సమయాల్లో వైసీపీ, జనసేనలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
– టీడీపీ నేత మాణిక్య వరప్రసాద్
అమరావతి, అక్టోబర్15(జనంసాక్షి) : తితలీ తుపాను బాధితులకు కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు విడుదల చేయాలని టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుద్ హుద్ సమయంలో వెయ్యికోట్లు తక్షణ సాయం అడిగితే మోదీ కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఆది నుంచి కేంద్రం ఏపీపై కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుపాన్ తీవ్ర నష్టాన్ని కలిగించిందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రైతుల పంటలు దెబ్బతినడంతో పాటు, పలుప్రాంతాల్లో ఇండ్లు నేలమట్టమై ప్రజలు నిర్వాసిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడంలో పూర్థిస్థాయిలో టీడీపీ ప్రభుత్వం సఫలమైందని, లేకుంటే ఇంకా పెను
ప్రమాదం సంభవించేందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో రాజకీయాలు చేయకుండా, పట్టుదలకు పోకుండా ఏపీలో తితలీ తుఫాన్‌తో నష్టపోయిన బాధితులను ఆదుకొనేందుకు తక్షణ సహాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని ఢొక్కా కోరారు. ఓపక్క ప్రజలు తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయారని, మరోవైపు చంద్రబాబు నాయుడు, టీడీపీ మంత్రులు, ఎంపీలు శ్రీకాకుళంలో మకాం వేసి ప్రజలను అండగా నిలుస్తున్నారని అన్నారు. కానీ వైసీపీ, జనసేన ఇలాంటి సమయాల్లోనూ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కవాతు చేయడానికి బదులుగా.. కార్యకర్తలను తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు పంపొచ్చు కదా అని అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మాని.. సీఎం చంద్రబాబుకు అండగా ఉండాలని డొక్కా మాణిక్య వర ప్రసాద్ సూచించారు.