తిత్లీ బాధితులను..  ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది


– స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు
– తిత్లీ తుఫాన్‌ బాధితులను పరామర్శించిన కోడెల
శ్రీకాకుళం, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : తిత్లీ తుఫాన్‌ బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. మంగళవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ..  తిత్లీ తుఫానుతో ఉద్దానం ప్రాంతానికి తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. తిత్లీ తుఫానుకు నష్టపోయిన కొబ్బరి తోటలు, జీడిమామిడి, పడిపోయిన ఇళ్లను స్పీకర్‌ పరిశీలించారు. తక్కువ కాలంలో ఎక్కువ ఫలసహాయాన్నిచ్చే పంటలను పండించు కోవాలని బాధిత రైతులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫానులో నష్టపోయిన ప్రాంతాల్లో మూడేళ్లలో ఫలసాయం ఇచ్చే మొక్కలు పంపిణీ చేసి, ఉపాధి హావిూ పథకం నుండి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మండల ప్రాధమిక పాఠశాలలో గ్రామస్తులను పరామర్శించి, ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు, నీరు అందుతున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. సోంపేట, రాజాం దారిపొడవున జీడి తోటలు, కొబ్బరి తోటలను పరిశీలించానని, తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. నేను గుంటూరు వాసినే సముద్రం ప్రక్కనే మా ఊరు ఉందనీ ఏనాడూ ఇంత నష్టం జరగలేదని, తిత్లీ తుఫాను వలన తీవ్రంగా నష్టపోయారన్నారని అన్నారు. విూరు త్వరగా కోలుకోవాలనే ముఖ్యమంత్రి ప్రభుత్వాన్నే పలాసలో ఉంచి అధికారులందరితో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం గొల్లవూరు స్వదేశీ మత్స్యకారుల(కండ్ర కులస్థుల) గ్రామాన్నిస్పీకర్‌ సందర్శించారు. ఇళ్లపై ఉన్న రేకులు తిత్లీ తుఫానుకు ఎగిరి పోయిన ఇళ్ళను ఆయన పరిశీలించారు. వలలు పోయాయని గ్రామస్తులు చెప్పారు. వలలు సంపాదించుకునేందుకు రెండు నెలలు పడుతుందని, అంతవరకు బియ్యం సరఫరా చేయాలని మత్స్యకారులు కోరారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు స్పీకర్‌ చెప్పారు.