తిత్లీ భీభత్సం

– శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు
– ఉదయం 5గంటలకు తీరం దాటిన తుఫాను
– తీరందాటిన సమయంలో 140 -150 కి.విూ వేగంతో ఈదురుగాలులు
– తిత్లీ తుఫాన్‌తో అల్లకల్లోలంగా మారిన సముంద్రం
– తీర ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరిన సముద్రపు నీరు
– తుఫాన్‌ ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబు సవిూక్ష
– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం
– పునరావాసాల్లో వసతులు కల్పించండి
– పంట, ఆస్తినష్టం సేకరించాలని అధికారులకు ఆదేశం
– రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
– సహాయ చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
– తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన
– ఈదురుగాలులకు చెట్టు, ఇల్లు కూలి ఇద్దరు మృతి
శ్రీకాకుళం, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. గురువారం ఉదయం 5గంటల సమయంలో తీరందాటిన తుఫాన్‌ భారీస్థాయిలో ఈదురుగాలులు, వర్షంతో విరుచుకుపడింది. ఈదురుగాలుతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. మరో ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాగం సహాయచర్యలు ముమ్మరం చేసింది. సాయంత్రం వరకు తుఫాను ప్రభావం ఉండనుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. ఈదురుగాలలతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ పునరుద్దరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అధికారులు ముంపు ప్రాంతాల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ధాటికి జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వంగర మండలం లోని అగ్రహారంలో చెట్టు విరిగిపడి అప్పలనరసమ్మ(62) మృతి చెందగా, సరుబుజ్జిలి మండలంలో ఇల్లు కూలి సూర్యారావు(55) మృతి చెందాడు. ఇదిలాఉంటే రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయచర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తుపాను కారణంగా జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని మంత్రి తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సహాయచర్యలు చేపడుతున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా విూద తిత్లీ తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉందని… తీరం దాటిన సమయంలో వీచిన పెనుగాలుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. 2014లో వచ్చిన హుద్‌హుద్‌ కంటే తిత్లీ తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం నివారించగలిగామని తెలిపారు. అయితే తుపాను తీవ్రత దృష్ట్యా ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉందన్నారు. విపత్తును ఆపలేమని… కానీ సరైన చర్యలు తీసుకోవడం ద్వారా విపత్తు నుంచి కలిగే నష్టాన్ని కొంత వరకైనా నివారించగలమని మంత్రి అన్నారు.
తిత్లీ తీవ్రతపై అధికారులతో సీఎం చంద్రబాబు సవిూక్ష ..
తిత్లీ తుఫాన్‌ తీవ్రతపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం సవిూక్ష నిర్వహించారు. గురువారం ఉదయం 5.40గంటల సమయంలో తీరాన్ని దాటిన వాయుగుండం పలాస పురపాలికలో తీవ్ర నష్టం కలిగించినట్లు సీఎం తెలిపారు. మరికొన్ని గంటల పాటు ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోపాలపురం పోర్టు వద్ద జరిగిన నష్టాన్ని గురించి స్థానిక మత్స్యకారులు సమాచారం అందించారు. తుపాన్‌ తెరిపి ఇచ్చిన వెంటనే పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నష్ట తీవ్రతను అంచనా వేసి ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోల ద్వారా సమాచారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేల కూలిన చెట్లు, పడిపోయిన విద్యుత్తు స్తంభాలకు జియోట్యాగింగ్‌ చేయాలని సూచించారు. బాధితులకు సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భోజనం, అల్పాహారం, తాగునీరు అందరికీ అందేలా చూడాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
ఉప్పాడలో ఎగిసిపడుతున్న అలలు..
తితలి తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తూ.గో జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో పెద్దఎత్తున అలలు రోడ్డుపైకి ఎగిసిపడటంతో రహదరి ధ్వంసమైంది. తీరాన ఉన్న ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మరువాడలో అలల ఉద్ధృతికి తీరం పది అడుగుల మేర కోతకు గురైంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు