తిరుపతిలో టిడిపికి ఎదురుదెబ్బ
జనసేనలో చేరిన మాజీ టిటిడి ఛైర్మన్ చదలవాడ
హైదరాబాద్,అక్టోబర్19(జనంసాక్షి): టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీలో మరో కీలక నేత చేరారు. తితిదే మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. పవన్ బాణం విసురుతున్న ఫొటోను, కృష్ణమూర్తితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. చదలవాడ టిడిపికి, చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉండేవారు. ఆయన పార్టీ వీడడంతో తిరుపతిలో పార్టీకి తీరని నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన తెదేపాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను చదలవాడ గానీ, జనసేన వర్గాలు గానీ ఖండించలేదు. ఈ క్రమంలోనే ఆయన గురువారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. అనంతరం పవన్, కృష్ణమూర్తి విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గత వారం జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు తెదేపా నుంచి కీలక నేతలు తమ పార్టీలో చేరినందున ఎన్నికల లోపు ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చేరికలతో రాజకీయంగా పార్టీ ముందుకు దూసుకుని వెళ్లే అవకాశం ఏర్పడింది.