తీగల్ లో కొనసాగుతున్న దీక్షలు
దీక్ష లో కూర్చున్న పారిశుధ్య కార్మికులు
జగదేవ్ పూర్ , ఆగస్ట్ 8 జనం సాక్షి:
జగదేవ్ పూర్ మండలంలోని తీగుల్ గ్రామాన్ని విభజించి ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు సోమవారం ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు కుర్చున్నారు. తిగుల్ మండల సాధన సమితి సభ్యులు, సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఎసిఎస్ డైరెక్టర్ భూమయ్య లు కార్మికులకు పూల దండలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 37సంవత్సరాల క్రితం మండలాల వ్యవస్థ ఏర్పాటు సమయంలోనే తీగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశాం. అప్పటి మా గ్రామంలో ఉన్న నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం మా గోడు పట్టించుకోలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన మండలాలను ప్రకటిస్తున్న జాబితాలో కూడా మా తీగుల్ గ్రామం లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తీగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని వారు కోరారు. కార్యక్రమంలో మండల సాధన సమితి సభ్యులు సభ్యులు రామచంద్రారెడ్డి, కిష్టయ్య, కరుణకర్ రెడ్డి, ఈశ్వర్, రాజు తదితరులు పాల్గొన్నారు.