తీరం దాటిన ‘ఫొని’

– ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు
– ఒడిశాలోని పూరీపై తుఫాన్‌ బీభత్సం
– 200 నుంచి 240 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు
– పలు ప్రాంతాల్లో నేలమట్టమైన ఇండ్లు
– తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 900 శిబిరాలు ఏర్పాటు
– సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
భువనేశ్వర్‌, మే3(జ‌నంసాక్షి) :  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను ఎట్టకేలకు ఒడిశాలోని పూరీ సవిూపంలో తీరం దాటింది. 22కి.విూ వేగంతో కదులుతున్న ఈ ప్రచండ తుపాను గోపాలపూర్‌-చాంద్‌బలీ వద్ద శుక్రవారం ఉదయం 10గంటల నుంచి 11.30 మధ్యలో పూర్తిగా తీరందాటింది. కాగా ఈ తుఫాన్‌ కోల్‌కతా విూదుగా బంగ్లాదేశ్‌ వైపుగా పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను ప్రభావంతో ఒడిశాలోని పూరీ, తదితర ప్రాంతాల్లో 200-240 కిలోవిూటర్ల వేగంతో ప్రచంఢ గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్‌కి వెళ్లేలోపే తుపాను బలహీనపడనుందని వాతావరణశాఖ తెలిపింది. బాలాసోర్‌ వద్ద తుపాను మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. బంగ్లాదేశ్‌కన్నా ముందు ఫొని తుపాను కోల్‌కతాను తాకే అవకాశముండటంతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో తీర ప్రాంత రక్షణ దళం 34 సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావం తెలుసుకోవాలని వాయుసేన విమానాలను సిద్ధం చేసింది. కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1938ను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 900 శిబిరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూసివేసి, పునరావాస కేంద్రాలుగా మార్చారు. మరోవైపు ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా-చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లు రేపటివరకూ రద్దు అయ్యాయి. భువనేశ్వర్‌, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తీరప్రాంత విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాల్స్‌లో ఆహార పదార్థాలు, మంచినీటిని సిద్ధంగా ఉంచినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అంతేకాకుండా మరో మూడు రోజుల వరకూ సెలవులు పెట్టొద్దని ఉద్యోగులకు రైల్వేశాఖ సూచించింది. ఇదిలా ఉంటే ఒడిశాలో గత 24 గంటల్లో సగటు వర్షపాతం 16.07 మి.విూగా నమోదు అయింది. జిల్లాల వారిగా నమోదు అయిన వర్షపాతం వివరాలు చేస్తే.. రాయ్‌గఢ్‌: 9.5 మి.విూ, కొ/రిళిల్నార : 5.2 మి.విూ, కెసింగ్‌పుర్‌: 1.8 మి.విూ, గుణ్‌పుర్‌: 24 మి.విూ, పద్మాపుర్‌ : 18.7 మి.విూ, గుడారి : 28.6 మి.విూ, రామన్‌గుడ : 14.4 మి.విూ, కటక్‌ : 3.2 మి.విూ, మునిగడ : 47 మి.విూ, చంద్రాపుర్‌ : 22 మి.విూ వర్షపాతం నమోదైంది.
ఉత్తరాంధ్రకు తప్పిన ఫొని ముప్పు…
ఉత్తరాంధ్రకు ఫొని తుపాను ముప్పు తప్పింది. స్వల్ప నష్టం మాత్రమే ఉందని అధికారులు ప్రకటించారు. తుపాను కదలికలను ఆర్టీజీఎస్‌ ఎప్పటికప్పుడు అంచనా వేసింది. తీరం దాటిన సందర్భంగా వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్‌ తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో సాధారణ పరిస్థితులు
నెలకొంటాయని స్పష్టంచేసింది. మరోవైపు 24 గంటల పాటు తుపాను గమనాన్ని అంచనావేసి సీఎం చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేశారు. గాలులకు అరటి తోటలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే పంటనష్టం అంచనాలపై అధికారులు సవిూక్షించనున్నారు. అందరినీ ఆదుకుంటామని ఇప్పటికే  ప్రభుత్వం హావిూ ఇచ్చింది. ఫొని తుపాను ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటిన సంగతి తెలిసిందే. పూరికి దక్షిణంగా ఫొని తుపాను తీరాన్ని దాటింది. తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఇదిలాఉంటే ఫొని తుపాను శ్రీకాకుళం జిల్లాను దాటిందని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి రాత్రంతా తుపాను కదలికలను గమనించిన ఆయన.. జిల్లాకు దాదాపు ముప్పు తప్పినట్టేనని ప్రకటించారు. ఇప్పటి వరకూ ఇచ్చాపురంలో 3 కచ్చా గృహాలు మినహా ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. కమ్యునికేషన్‌ వ్యవస్థకు కూడా ఎలాంటి నష్టం కలగలేదని నివాస్‌ పేర్కొన్నారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తామన్నారు. తుపాను తరువాత వరదలు వచ్చే అవకాశముందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నివాస్‌ సూచించారు.
‘ఫొని’ఎఫెక్ట్‌పై గవర్నర్‌ ఆరా..
ఫొని తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, సహాయక చర్యలపై గవర్నర్‌ నరసింహన్‌ ఆరా తీశారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సీఎస్‌ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ నరసింహన్‌కు వివరించారు.