తుపాన్ బాధితుల ఆందోళన
శ్రీకాకుళం,అక్టోబర్15(జనంసాక్షి): : సిఐటియు ఆధ్వర్యంలో పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో సుడికొండ-సాయినగర్ ప్రజలు సోమవారం నిరసన చేశారు. ఇప్పటివరకూ పల్లెల్లో వెల్లువెత్తిన ప్రజల నిరసన సోమవారం నుండి పట్టణాలలో ప్రారంభమైంది. తిత్లీ తుపాను బీభత్సం బారిన పడ్డ ప్రజలకు ఇంతవరకూ కనీసం ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందడం లేదని ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై సుడికొండ-సాయినగర్ ప్రజలలో నిరసన భగ్గుమంది. ప్రభుత్వం చెపుతున్న మాటలన్నీ కేవలం మాటలకే పరిమితమయ్యాయని, తమ ప్రాంతాలను సందర్శించారే తప్ప 5 రోజులైనా ఇంతవరకూ కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వలేదని, ప్రభుత్వ అధికారులెవ్వరూ స్పందించడం లేదని ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పలాసలలో తుపాను బాధితులకు ఇంతవరకూ ఎలాంటి సాయం అందలేదని ప్రజలు ఆవేదన చెందారు. నిరసన నేపథ్యంలో ప్రజలను నివారించడానికి పోలీసులు ప్రయత్నించగా..పోలీసులు, అధికారులతో సిఐటియు నాయకులకు వాగ్వాదం నెలకొంది.