తుఫాను బాధితులగోడు జగన్‌కు పట్టదా?
– పవన్‌కు చంద్రబాబు, లోకేశ్‌లను విమర్శించడమే పని
– ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
రాజమహేంద్రవరం, అక్టోబర్19(జనంసాక్షి) : శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ధాటికి జన జీవితాలు అతలాకుతలమైతే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు పట్టకపోవడం విడ్డూరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తనకు ఏవిూ పట్టనట్లు పవన్ కవాతు నిర్వహించుకున్నాడని విమర్శించారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై విమర్శలు చేయడాన్నే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ తానేదో పైనుంచి దిగివచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలంతా అవినీతిపరులని విమర్శిస్తున్న పవన్.. తన పార్టీలోనే నేర చరిత్ర గలవారు చేరిన విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఉద్దానం అంటే తనకు ఎంతో ఇష్టమని శ్రీకాకుళం జిల్లాలో హడావిడి చేసిన ఆయన తుఫాను విధ్వంసం సృష్టించి ఆరు రోజులైనా అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. శ్రీకాకుళానికి పొరుగు జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు తుపాను బాధితుల గోడు పట్టలేదని ఆరోపించారు. మొదటి విడతగా రూ.2500 కోట్లు కేంద్ర సాయం కోరామని.. కేంద్రం మాత్రం స్పందించలేదని రాజప్ప చెప్పారు. అనంతరం రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తిత్లీ తుపాను బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం అందించని కేంద్రంపై ఏపీ ప్రజలు ఎదురు తిరిగే రోజులు ఆసన్నమయ్యాయని విమర్శించారు.