తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను..  హతమార్చుతాం


– మావోయిస్టు పోస్టర్ల కలకలం
కోల్‌కతా, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మురాకత్‌ అటవీ ప్రాంతంలో మావోల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను హతమార్చుతామంటూ పశ్చిమ్‌ బంగాలోని గుర్‌గురిపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మురాకతా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం పోస్టులు లభించాయి. ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సురెండు అధికారీ, సల్బోనీ ప్రాంత ఎమ్మెల్యే శ్రీకాంత్‌ మహతోల పేర్లను పేర్కొంటూ మావోయిస్టులు హెచ్చరికలు చేశారు. ‘వారి తలలు నరికి తీసుకురండి అంటూ పేర్కొన్నారు. రూ.2కే కిలో బియ్యం ఇస్తామంటూ చెబుతూ జంగల్‌మహల్‌లోని ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని అందులో పేర్కొన్నారు. తాము కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మావోయిస్టులమని కూడా వారు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని గోల్‌తోర్‌ పోలీసులు నిన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సబ్య్‌సాచి గోస్వామి, సాంజిబ్‌, అర్కదీప్‌ గోస్వామి, టిప్పు సుల్తాన్‌లుగా వారిని గుర్తించారు. వారంతా ఓ రహస్య సమావేశానికి వెళుతుండగా కంజిమక్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఫుట్‌బాల్‌ మైదానం వద్ద అరెస్టు చేశామని, వారి వద్ద 43 కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోస్టర్లు లభ్యమయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు… ఇది మావోయిస్టుల పనేనా? లేదా ఇతర దుండగులు వారి పేరుతో రాసిన పోస్టర్లా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. జంగల్‌మహల్‌ ప్రాంతంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోయారు. అయితే, తిరిగి అదే ప్రాంతంలో మళ్లీ తమ ప్రాబల్యాన్ని నెలకొల్పాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మిషన్‌లో భాగంగానే మావోయిస్టులు ప్రణాళిక వేసుకున్నారని, ఈ నేపథ్యంలో ఈ పోస్టర్లు బయటపడి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు.