తెదేపా గూటికి కోట్ల?

– రాత్రి భోజనానికి రావాలని చంద్రబాబు ఆహ్వానం
– కుటుంబ సభ్యులతో కలిసి బాబుతో భేటీకానున్న సూర్యప్రకాశ్‌రెడ్డి
– కోట్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అనుచరులు
– ఇప్పటికే యువజన కాంగ్రెస్‌ పదవులకు పలువురు రాజీనామా
– బాబుతో భేటీ తరువాత చేరికపై రానున్న స్పష్టత
అమరావతి, జనవరి28(జ‌నంసాక్షి) : కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి  తెదేపా గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్‌ను వీడే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సూర్యప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కోట్ల పార్టీ మారుతున్నారన్న సమాచారంతో కర్నూలులోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. సూర్యప్రకాశ్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి
ఉంటామని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోట్ల తెదేపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును ఆయన సోమవారం రాత్రి కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కోట్ల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు రాత్రి భోజనానికి ఆహ్వానించారని.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుని ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈభేటీకి తన సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రను కోట్ల తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తన సన్నిహితులు, కుటుంబసభ్యులు తెదేపా తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిలో టీడీపీ పనిచేస్తోంది. మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా పలు పార్టీలు కూటమిగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి పనిచేసినప్పటికీ ఘోరపరాభవాన్ని చవిచూశాయి. కాగా త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్‌ పొత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ ఒటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. దీనిని వ్యతిరేకించిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సమావేశం మధ్యలోనే వెనుదిరిగి వచ్చారు. కాగా అప్పటి నుండి ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడుతారనే ప్రచారం జరిగింది. ఆదివారం ఆయన అనుచరులతో భేటీ అయిన కోట్ల తెదేపాలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం రాత్రి చంద్రబాబుతో కోట్ల కుటుంబ భేటీ కానుంది. ఈ చర్చల అనంతరం కోట్ల తెదేపాలో చేరుతాడా.. చేరితే ఎప్పుడు చేరుతాడు.. అలాకాకుంటే కాంగ్రెస్‌లోనే ఉంటారా..? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.