తెదేపా డేటాను తస్కరించారు

– కేసీఆర్‌ సహకారంతో వైకాపా దొంగిలించింది
– వైకాపా కాల్‌ సెంటర్‌ నుంచి కార్యకర్తలకు ఫోన్‌లు చేస్తున్నారు
– వైకాపా ఎంపీలను బీజేపీ, కేసీఆర్‌ నిర్ణయిస్తున్నారు
– ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, మార్చి5(జ‌నంసాక్షి) : ఎన్నో ఏళ్లుగా భద్రపర్చుకుంటూ వస్తున్న తెలుగుదేశం పార్టీ డేటాను కేసీఆర్‌ సహకారంతో వైకాపా దోపిడీ చేసిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అమరావతిలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెదేపా డేటాను అక్రమంగా దోపిడీ చేశారని అనడానికి సంబంధించిన ఆధారాలను దేవినేని విూడియా ఎదుట బహిర్గతం చేశారు.  గొల్లపూడికి చెందిన శీనునాయక్‌ అనే కార్యకర్తకు వైకాపా కాల్‌ సెంటర్‌ నుంచి వచ్చిన ఫోన్‌ వాయిస్‌ రికార్డును విూడియా సమావేశంలో మంత్రి వినిపించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు ఓటుకు ఐదు వేలిస్తామంటూ మభ్య పెడుతున్నారని.. స్థానికులే వారిని పోలీసులకు అప్పజెప్పారని మంత్రి తెలిపారు. ఓ మహిళ తనకు ఫోన్‌ చేసి విూ డేటా అంత మా దగ్గర ఉందని.. జగన్‌ విూతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పారని కార్యకర్త శీను నాయక్‌ ఈ విూడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో డిలీషన్‌ టెక్నాలజీ, ఏపీలో డెవలప్మెంట్‌ టెక్నాలజీ ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో 28లక్షల ఓట్లు తొలగించి తెరాస తిరిగి అధికారంలోకి వచ్చిందని, ఏపీలో 58లక్షల ఓట్లను తొలగించి వైకాపాను అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థులను కేసీఆర్‌, భాజపా నిర్ణయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫామ్‌ హౌసుల్లో కూర్చొని రామ్‌ మాధవ్‌, కేసీఆర్‌ వైకాపా ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో జగన్‌ కుమ్మక్కై ఏపీ పోలీసులపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఏపీకి కూడా అధికారం ఉందని, ఆ విషయం తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్టుందని ఉమామహేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌పై తెలంగాణకు ఎంత అధికారం ఉందో, ఏపీకీ అంతే అధికారం ఉందన్నారు. కేసీఆర్‌ ముసుగు తొలగించి ముందుకురావాలని మంత్రి సవాల్‌ చేశారు. జగన్‌ గృహ ప్రవేశానికి వస్తానని ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికారని, అలాగే విశాఖ వస్తానని అన్నారని ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారని, టీడీపీ జాతీయ పార్టీగా దేశంలో ఎక్కడైనా పోటీ చేస్తామని, ప్రచారం చేస్తామని ఆయన అన్నారు.
కేసీఆర్‌ ఉత్తరకుమారుని ప్రగల్భాలు కాకుండా ఏపీలో ఎక్కడికి వస్తారో రావాలని మంత్రి దేవినేని సవాల్‌ చేశారు. ముసుగు తీసి నేరుగా బయటకు వస్తే.. ధైర్యంగా ప్రజలవద్దకు వెళదామని అన్నారు. ఫామ్‌ 7 ద్వారా ఓట్లు తొలగించే పక్రియకు వైసీపీ శ్రీకారం చుట్టిందని, దీనిపై ఈసీ విచారణ జరిపి 45 కేసులు నమోదు చేసిందని, దీనికి జగన్‌ సమాధానం చెప్పాలని మంత్రి దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు.