తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలట!
ఆజాద్ వంకర మాటలు
శ్రీనగర్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ ఆజాద్ మరోమారు దాటవేత ధోరణి ప్రదర్శించారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు. ఇప్పటికి ప్పుడు సమస్య పరిష్కారం కాదన్నారు. తెలంగాణపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కూడా ఆయన బుధవారం శ్రీనగర్‌లో అన్నారు. ఏకాభిప్రాయానికి మరింత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం తర్వాతనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై ఇంకా ఇరు ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర సంక్షోభంపైన కూడా ఆజాద్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవాం యూపిఏ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారుడు అని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌తో కాంగ్రెసుకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు, ఎన్సీపికి కూడా ఎలాంటి విభేదాలు లేవన్నారు. అజిత్ తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే పదవికి రాజీనామా చేశారని చెప్పారు.కాగా ఈ నెలాఖరులోగా తెలంగాణపై, కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనంపై ప్రకటనలు వెలువడుతాయంటూ సంకేతాలు ఇచ్చిన కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా వెనక్కి తగ్గినట్లే చెప్పవచ్చు. ఈ రోజు ఆజాద్ మాత్రమే కాకుండా కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి తెలంగాణపై కటువుగానే మాట్లాడారు. తెలంగాణ ఎక్కడుందని ఆయన ఏకంగా ప్రశ్నించారు. తెలంగాణపై తాము ఆలోచించడం లేదని , తెలంగాణపై ఇప్పట్లో ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆజాద్ కూడా ఏకాభిప్రాయం లేదనడం చూస్తుంటే ఇక తెలంగాణపై ఇప్పటి వరకు జరుగుతున్నదంతా కేవలం డ్రామా అని తేలిపోయింది. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో సమావేశంలో తెలంగాణపై చర్చించలేదని జనార్దన్ ద్వివేది కూడాస్పష్టం చేశారు. అధిష్టానం జాతీయ అంశాలతోనే బిజీగా ఉందని, తెలంగాణపై ఆలోచన చేయడం లేదని అన్నారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై ప్రశ్నించగా, ఆ విషయం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడగాలని వాయలార్ రవి చెప్పారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ మార్చ్ ఉందని, హింస ప్రజ్వరిల్లవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విూడియా ప్రతినిధులు అన్నప్పుడు ఆయన అదో రకంగా పెదవి విరిచారు.కెసిఆర్ తనను కలిశారని, తెరాస విలీనం విషయం పెద్ద విషయమని ఆయన అన్నారు. తాను తెలంగాణపై కెసిఆర్‌తో చర్చలు జరుపుతున్నట్లు- గతంలో విూడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన వాయలార్ రవి ఏకంగా అదేమిటో తెలియదన్నట్లు మాట్లాడారు. నేడో రేపో కెసిఆర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి. మొత్తం విూద, అందరి అనుమానాలను నిజం చేస్తూ కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.