తెలంగాణపై కేంద్రం దృష్టి : బొత్స
న్యూఢిల్లీ, జూలై 21 : తెలంగాణపై కేంద్రం దృష్టి సారించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. హిందీ మాట్లాడేవారికి 13 రాష్ట్రాలు ఉండగా తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉండడంతో తప్పేమిటని ఆయన విలేకరులకు ఆయన ఎదురు ప్రశ్న వేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై తన వద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు. మంత్రివర్గంపై స్పందించాల్సింది ఎఐసిసి కార్యదర్శి కెబి కృష్ణమూర్తి అని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్నారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వల్లే జగన్‌కు కష్టాలు అన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి ఎన్నికల సమయానికి జగన్‌కేసు దర్యాప్తు సంస్థల పరిధిలోనిదని, ఆ కేసులతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించడం వారికే చెల్లిందన్నారు. ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదని వ్యాఖ్యానించారు.