తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

– నాలుగేళ్లలో తెలంగాణకు 2.3లక్షల కోట్లు ఇచ్చాం
– టీఆర్‌ఎస్‌తో మాకు ఎలాంటి పొత్తు లేదు
– కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకం
– కేసీఆర్‌ ఇచ్చిన హావిూల్లో ఒక్కటి అమలు చేయలేదు
– దళిత సీఎం హావిూని కేసీఆర్‌ నిలబెట్టుకోవాలి
– మూఢనమ్మకాలతో సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్‌ ఒక్కరే
– ఒకే దేశం.. ఒకే ఎన్నికలే మా నాయకుడి నినాదం
– జమిలి ఎన్నికలకు.. ముందు కేసీఆర్‌ మద్దతు తెలిపారు
– రాజకీయ లబ్ధికోసమే ముందస్తుకు వెళ్తున్నాడు
– ప్రజలపై వేలకోట్ల భారం పడుతుంది
– ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా లబ్ధిపొందేందుకు కేసీఆర్‌ కుట్ర
– ఎన్నికల తరువాత భాజపా నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది
– బాబుకు నోటీసులతో భాజపాకు సంబంధం లేదు
– కాంగ్రెస్‌తో పొత్తుపై బాబు మరోసారి ఆలోచించుకోవాలి
– విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
హైదరాబాద్‌, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు మాకు వ్యతిరేఖమేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శనివారం హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా అమిత్‌షా కేసీఆర్‌ ప్రభుత్వంపై పలు విమర్శలు,  ప్రశ్నలు సంధించారు. జమిలి ఎన్నికలను కేసీఆర్‌ మొదట సమర్థించారని, కానీ ముందస్తుకు వెళ్లారని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతుందని, ఈ విషయం తెలిసినా ఎందుకు భారం మోపుతున్నారని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం కోట్ల రూపాయల ఖర్చు మోపారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గంలోని ప్రతి ఒక్క సీటుకు పోటీ చేస్తామని ప్రకటించారు. 2014-16 సంవత్సర కాలంలో బీజేపీ పటిష్టత్వానికి కృషి చేయడం జరిగిందని, ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ ప్రతిష్ట పెరిగిందన్నారు. అత్యధిక స్థానాల్లో గెలుపొందడమే తమ ధ్యేయమని, ఆమేరకు తమ క్యాడర్‌ ముందుకు సాగుతుందని అమిత్‌షా అన్నారు. సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవం ఎందుకు బంద్‌ చేశారని అమిత్‌షా ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడితోనే కార్యక్రమం నిర్వహించడం లేదని ఆరోపించారు. తెలంగాణాను రజాకార్ల చేతుల్లోకి పెడుతారా అంటూ అమిత్‌షా ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్‌ పాలనపై ఆలోచించాలని సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్‌ పలు ప్రయత్నాలు చేశారని, ఇలాంటి ప్రభుత్వం మళ్లీ వస్తే ఇలాంటివి పునరావృతమవుతుందన్నారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌ చేయాలని కేంద్రానికి పంపారని, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని కేసీఆర్‌కు తెలుసని, అయినా బిల్లును పంపారని అన్నారు. కేసీఆర్‌ వస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు  చేస్తాడని అమిత్‌షా విమర్శించారు. రాష్ట్రంలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పివి నరసింహరావు, అంజయ్యలను కాంగ్రెస్‌ అవమానాలకు గురి చేసిందన్నారు. దళితులకు కేసీఆర్‌ ఒక వాగ్ధానం ఇచ్చారని, ఈ విషయం దళితులు మరిచిపోలేరని తెలిపారు. 2018లో అలాంటి హావిూని నెరవేరుస్తారా అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులకు, అమరవీరులకు ఎన్నో హావిూలిచ్చారని గర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందించిందని, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న హావిూ ఏమైందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలన్నారు. కేసీఆర్‌ పాలన చూసిన తరువాత మళ్లీ టీఆర్‌ఎస్‌ వస్తుందని అనుకోవడం లేదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడం లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తన కుటుంబం కోసం కేసీఆర్‌ ముందస్తుకు వెళుతున్నారని అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూంలు కట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, మూఢ నమ్మకంతో సచివాలయానికి వెళ్లకపోవడం సబబేనా అంటూ ప్రశ్నించారు. నేరళ్లలో ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే దళితులను వేధించారని, మద్దతు అడిగిన రైతులని ఖమ్మంలో అరెస్టు చేయించారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కనీసం కేంద్ర పథకాలను కూడా ఉపయోగించుకోలేదన్నారు. వెనుకబడిన జిల్లాల కోసం రూ. 900 కోట్లు నిధులు, 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 16,597 కోట్లు నిధులు, తెలంగాణకు అనేక విద్యా సంస్థలు మంజూరు, ఎయిమ్స్‌తో పాటు కొత్త వర్సిటీల మంజూరు చేయడం జరిగిందని అమిత్‌ షా వెల్లడించారు.
బాబుకు నోటీసులకు భాజపాకు సంబంధం లేదు..
చంద్రబాబుకు కోర్టు నోటీసులు ఇవ్వడం వెనుక భాజపా కుట్ర ఉందని అనడం సరికాదని, అది ఒట్టి అబద్దమని అమిత్‌షా అన్నారు. కేసు నమోదైనప్పుడు మహారాష్ట్ర, తెలంగాణలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉందని అన్నారు. ఎన్నికల వేళ ఈ వారెంట్‌ను అడ్డుపెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధిపొందేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని అమిత్‌షా ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌తోనే చంద్రబాబు జట్టు కట్టేందుకు చూస్తున్నారని, కాంగ్రెస్‌తో పొత్తుపై చంద్రబాము మరోసారి ఆలోచించుకోవాలని అమిత్‌షా సూచించారు. పార్లమెంట్‌లో కేసీఆర్‌ను మోదీ పొగడలేదని, రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి మాత్రమే పోల్చారని అన్నారు. మంచి పనులు ఎవరు చేసినా మోడీ ప్రశంసిస్తారని అమిత్‌షా పేర్కొన్నారు.