తెలంగాణలో కాంగ్రెస్‌ వ్యూహాత్మక తప్పిదం

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ తరచూ గుజరాత్‌ తరహా పొత్తులు అన్న వ్యూహంతో ముందుకు సాగాలని అనుకున్నా తెలంగాణలో మాత్రం ఓ రకంగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందనే చెప్పాలి. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక కూటమిలో ఉన్న నేతలను కూడగట్టడంలో విఫలం అయ్యారు. అలాగే సకాలంలో పొత్తులు కుదుర్చుకుని టిక్కెట్లు సకాలంలో ఇవ్వడంలో కూడా విఫలం అయ్యారు. గత ఏడాది నుంచే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ తన జోరును పెంచి తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌కు సవాళ్లవిూద సవాళ్లు విసురుతూ వచ్చినా, కాంగ్రెస్‌ చివరి నిముషంలో చతికిలిల పడింది. టిక్కెట్ల విషయం వచ్చే వరకు మిత్రులకు లేదా ఇతర ఉద్యమ నేతలను పక్కన పెట్టారు. దీనికి తోడు కెసిఆర్‌తో సమానంగా నిలవగలిగిన నేతలు పార్టీలో లేకుండా పోయారు. కోదండరామ్‌ను ముందుకు పెట్టి ఆయనే కన్వీనర్‌ అని చెప్పినా ఎందుకనో ఆయనకు కూడా విలువనీయకుండా టిక్కెట్ల కేటాయింపులు జరిపారు. ఉత్తమ్‌, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎంతగా ముందు నిలబడ్డా కెసిఆర్‌ టీమ్‌కు సవాల్‌ విసిరే స్థాయి లేదు.

గుజరాత్‌లో విజయం సాధించకున్నా అక్కడ అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టించేలా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగారు. కర్నాటకలో ఎన్నికల తరవాత ఏకతాటిపై విపక్షాలను తీసుకుని రాగలిగారు. ఈ తరహాలోనే తెలంగాణలో కూడా గుజరాత్‌ తరహా రాజకీయాలు అంటూ ప్రచారం చేసుకున్నారు. సవాళ్లు విసరుతూ, రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ ప్రతిసవాళ్లు విసురుకుంటూ తొలినాళ్లలో రాజకీయం వేడెక్కించారు. ప్రజల్లో ఆసక్తి కలిగించారు. కానీ కాంగ్రెస్‌ తన పాతపద్దతిలోనే ముందుకు సాగింది. కూటమి కట్టినా కూటమి నేతలకు టిక్కెటల్‌ సర్దుబాటులో పెత్తనం లేకుండా చేశారు. అలాగే ఉద్యమంలో నిర్లక్ష్యానికి గురైన నేతలను అక్కున చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చివుంటే కాంగ్రెస్‌ పట్ల విశ్వాసం పెరిగేది. కెసిఆర్‌ను విమర్శించడానికి అవకాశం వచ్చేది. కానీ ఉత్తమ్‌, జానా,కోమటిరెడ్డి బ్రదర్స్‌ లాంటి వారు పార్టీని పట్టుకుని వెళాడుతూ వారిదే పెత్తనం అన్నట్లుగా టిక్కెట్లను కేటాయించుకున్నారు. మొత్తానికి ఏడాదికి ముందే ఎన్నికల వేడిని ఎక్కించే ప్రయత్నాలు చేసి టిక్కెట్ల వరకు వచ్చే సరికి పాత మూసపద్దతినే అవలంబించారు. అయితే నోట్లరద్దు, జిఎస్టీ వంటి అంశాలతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకుని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. రాష్ట్రాల్లో గుజరాత్‌ తరహా అంటూ అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపించినా ఆచారణలో మాత్రం అనుసరించలేదు. రాష్ట్రాలలో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపాలని పిలుపునిచ్చారు. ఇదేకనుక కాంగ్రెస్‌ ఉద్దేశమైతే, ప్రాంతీయ పార్టీలతో స్నేహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించేవి. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కేంద్రంలో కలిసి పనిచేసేలా సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌ అనుసరించిన తీరు మాత్రం దారుణంగా ఉంది. ప్రాంతీయ పార్టీలలో బలమైన పునాది కలిగిన నాయకులను, వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులను కలుపుకుని పోయివుంటే కాంగ్రెస్‌ను ప్రజలు కూడా నమ్మేవారు. ఈ దశలో కాంగ్రెస్‌ పూర్వ వైభవాన్ని సంతరించు కోవడం అనుమానమే. ఎన్నికల ముందే బీజేపీయేతర కూటమిని పటిష్ట పరుచాలని, దానికి కాంగ్రెస్‌ కేంద్ర బిందువుగా ఉండాలని సోనియా భావించారు. తెలంగాణలో ఇప్పటికే అనేకమందిని పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్‌ మరికొందరి పై దృష్టి సారించింది. ఇలా కట్టిన కూటమి వల్ల రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని భావించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాలను సమన్వయం చేసే బాధ్యత చేపట్టి ముందుకు సాగాలని చూసినా వృద్దతరం నేతలు పార్టీని వదలకుండా, సీట్లను వదలకుండా పేచీ పెట్టడం కారణంగా లక్ష్యం నెరవేరే

అవకాశాలు కానరావడం లేదు. సీట్ల కోసం పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి తదితరులు చేసిన యాగీయే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కొత్త రక్తం ఎక్కించాలన్న ధ్యాస, లేదా ఆలోచన కానీ లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో బీజేపీయేతర ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలను తెలంగాణలో సఫలం చేసుకునే అవకాశాలను జారవిడుచుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో మోదీ ప్రభంజనం ఉండకపోవచ్చు. మోడీపై ప్రజలకు భ్రమలు తొలిగాయి. బీజేపీ బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలాగని కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బలపడే సూచనలు లేవు. అందుకే కాంగ్రెస్‌ తెలివిగా అన్ని పక్షాలను కలుపుకుని పోవాలని చూస్తోంది. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన తరవాత గతం కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొంత పరిణతి చెందిన నేతగా కనిపిస్తున్నారు. ఆయన నాయకత్వానికి ఆమోదం లభించకున్నా వ్యతిరేకత తొలగుతోంది. బీజేపీయేతర కూటమిలో నెలకొన్న నాయకత్వ శూన్యత కాంగ్రెసేతర పక్షాల నేతలకు ఆశ పుట్టిస్తున్నది. జాతీయ స్థాయిలో, రాష్ట్రాలలో పరిణామాలను గమనిస్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా కూటమిగా కదలాలని చూస్తున్నారు. చంద్రబాబు రాకతో విపక్షాల్లో మళ్లీ ఐక్యతారనాగం బలపడింది. ఈ దశలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరు కారణంగా పాతతరహాలో కాంగ్రెస్‌ సాగడం వల్ల అనుకున్న ఫలితం దక్కుతుందా అన్నదే అనుమనంగా ఉంది. ఈ కూటమి వల్ల రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కెసిఆర్‌ ఎన్నికల ఎత్తుల ముందు కూటమి బలంగా ఉండివుంటే నెగ్గుకుని వచ్చేది. వ్యక్తిగతంలో బలమైన నేతలు పోటీలో ఉండివుంటే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖచ్చితంగా ఓడించేవారు. కానీ కాంగ్రెస్‌కు అతి విశ్వాసం ఎక్కువ. అదే ఇప్పుడు కొంపముంచినా ఆశ్చర్య పడాల్సిన అసవరం లేదు.