తెలంగాణలో ‘నిఫా’ లేదు

ఎలాంటి అపోహలొద్దు: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్‌: రాష్ట్రంలో నిఫా వైర‌స్ లేదని, ప్రజ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి స్పష్టం చేశారు. విషజ్వరాలతో బాధ ప‌డుతున్న ఇద్దరికి కేవలం అనుమానంతో చేసిన ప‌రీక్షలు నెగెటివ్‌గా వచ్చాయని.. వాళ్ల నమూనాలను పుణెలోని ఐసీఎంఆర్‌లో పరీక్షలు చేయించినట్లు చెప్పారు. ఒకరు ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు చికిత్సకు వెళ్ళగా ఫీవ‌ర్ ఆసుపత్రికి పంపించారని, నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించగా నిఫా వైరస్ లేనట్లు తేలిందని మంత్రి చెప్పారు. బాధితుడికి టైఫాయిడ్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారని, ప్రత్యేక వార్డులో చేర్పించి వైద్యం అందించి.. ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి పంపించారన్నారు. తీవ్ర జ్వరంతో బాధ‌ప‌డుతూ మ‌రో వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని, అనుమానంతోనే నిఫా ప‌రీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సదరు బాధితుడు మెదడు సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నట్లుగా వైద్యులు గుర్తించారని… ఆయ‌న‌కు శస్త్ర చికిత్స చేయ‌డానికి నిర్ణయించినట్లు లక్ష్మారెడ్డి వివరించారు. ప్రజ‌లు ఎలాంటి అనుమానాలు, అపోహలకు ‌పోవ‌ద్దని… అన్ని ర‌కాలుగా వైద్య శాఖ సిద్ధంగా ఉండటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి వివరించారు.