తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం

ఓటేసేందుకు బారుల తీరిన ప్రజలు
ఉత్సాహంగా ముందుకు వచ్చిన యువ ఓటర్లు
పలు గ్రామాల్లో ఓట్లు లేక ఆగ్రహంతో వెనుదిరిగిన ప్రజలు
ఓటేసిన గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కెసిఆర్‌ దంపతులు
ఓటేసిన రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినీ ప్రముఖులు
ఉదయం 11 గంటల వరకూ 23.17శాతం పోలింగ్‌ నమోదు
హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి):  తెలంగాణలో చెదురుముదురు ఘటనలు మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా మొదలయ్యింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువ ఓటర్లు ఆసక్తిగా క్యూలు కట్టారు. ఉదయం 11 గంటల వరకూ 23.17శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈవీఎంలు మొరాయించినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, దివ్యాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. గవర్నర్‌ నరసింహన్‌, ఆయన సతీమణి సోమాజిగూడ, రాజ్‌ నగర్‌లోని ఐసీడీఎస్‌ అంగన్వాడీ కేంద్రం పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలాచోట్ల ఓటు లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. నగరంతో పాటు పలు జిల్లాల్లో ఓటరు కార్డున్నా జాబితాలో ఓటు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనని గ్రామాల్లో దీనికి నిరసనగా ఓటింగ్‌ను బహిష్క రించారు. ఉప్పల్‌ నియోజకవర్గం 10వ డివిజన్లో గందరగోళం నెలకొంది. పోలింగ్‌ కేంద్రం 297, 297ఏ పరిధిలో ఓటర్‌ కార్డులున్నా లిస్ట్‌లో పేరు లేకపోవటంతో కొందరు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకోలేక పోయారు. వందల మంది ఓటర్లు ఓటు వేయకుండానే వెనుతిరుగుతున్నారు. దీనిపై రిటర్నింగ్‌ అధికారిని కలసినా ఫలితం లేదని ఓటర్లు చెబుతున్నారు. గత ఎన్నికలతో పాటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఓట్లు వేశామని ఓటర్లు తెలిపారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారుల నుంచి సరైన సమాధానం లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజును సెలవుగా భావించకుండా… ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగింటుకోవాలని నరసింహన్‌ పిలుపునిచ్చారు. ఓటు వేసినప్పుడే సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంటుందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణి శోభతో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌లో సైతం ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు.  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని సెయింట్‌ నిజామిస్‌ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులతో వచ్చి చిక్కడపల్లి శాంతినికేతన్‌ మైదానంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. భాజపా అంబర్‌పేట్‌ నియోజకవర్గ అభ్యర్థి గంగాపురం కిషన్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కాచిగూడ దీక్షా మోడల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పొలింగ్‌ శాతాన్ని పెంచాలని కోరారు. కిషన్‌ రెడ్డి కూతురు వైష్ణవి
తొలిసారిగా ఓటు వేశారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రాంనగర్‌ జెవి. హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌ సరళి నిశ్శబ్దంగా జరుగుతోందని, ఓటర్లు తమ మనసులోని అభిప్రాయాన్ని ఎవరితో పంచుకోకుండా ఓట్లు వేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి పోలింగ్‌ శాతాన్ని పెంచాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలోని పొతంగల్‌లోని ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాలలో భర్తతో కలిసి ఎంపీ కవిత ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఎన్నికల్లో మహాకూటమి నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెజస అధ్యక్షుడు, ప్రజాకూటమి ఛైర్మన్‌ కోదండరామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని నాంపల్లి హుమయూన్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్‌లోని కాశ్మీర్‌ గడ్డ యునైటెడ్‌ ఇంగ్లీష్‌ విూడియం స్కూల్‌లో కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని పార్టీల కార్యకర్తలు కండువాలు కప్పుకుని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే సాయంత్రం లోపు తమ పార్టీ కార్యకర్తలు కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద మొహరిస్తారని హెచ్చరించారు.  మహేశ్వరం అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి , ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  అలాగే  రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియో గించుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాలలో వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ వాసవి జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం.. నిజామాబాద్‌లో గణెళిష్‌ గుప్తా.. మహబూబ్‌నగర్‌లో ఆలా వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌.. ఖానాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రేఖానాయక్‌.. కరీంనగర్‌లో ఎంపీ వినోద్‌ కుమార్‌.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌.. హైదరాబాద్‌ చిక్కడపల్లిలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితర రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులతో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే వరంగల్‌ జిల్లాలో 22 శాతం పోలింగ్‌ నమోదు కాగా, మెదక్‌ జిల్లాలో 14శాతం, నిజామాబాద్‌లో 11 శాతం, మహబూబ్‌నగర్‌లో 12 శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.90 లక్షల మంది భద్రతా బలగాలు పోలింగ్‌ పక్రియలో పాల్గొంటున్నాయి. అధికార తెరాస, మహాకూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. రేవంత్‌రెడ /-డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 11గంటల వరకు 33శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గంలో 22.5శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అటు టీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటర్లు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పట్నం నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే… కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని కూడా అటు టీఆర్‌ఎస్‌, ఇటు తెలుగుదేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసిని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాధవరం
కృష్ణారావు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డిపై దాడి
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పోలింగ్‌ జరుగుతోన్న సమయంలో గ్రామానికి చేరుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణతో భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు తనపై రాళ్లతో దాడి చేశారని వంశీచంద్‌రెడ్డి తెలిపారు. స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
సబితను అడ్డుకున్న నేతలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు వచ్చిన మహాకూటమి అభ్యర్థి సబితారెడ్డిని టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. సబితా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు వీలులేదని వారు స్పష్టం చేశారు. కాగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సర్దుమణిగింది. ఈ సందర్భంగా సబిత విూడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ ప్రజను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. మహాకూటమి విజయం తథ్యమని ఆమె స్పష్టం చేశారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని సబితారెడ్డి కోరారు.