తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైంది – బిజెపి సీనియర్ నేత గజ్జల యోగానంద్”

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ప్రభంజనం మొదలైందని, గులాబీ కంపెనీ అంతా ఏకమై వచ్చినా ఒక్క బీజేపీ కార్యకర్తనుకూడా కదిలించలేరని భాజపా సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం బిజెపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందని, ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కంపెనీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మరి ఏ రాష్ట్రంలోనూ ఇంత దుర్మార్గమైన పాలనలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దొంగోడికి ఇంటి తాళం చేయించిన చందంగా రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని, పుట్టబోయే బిడ్డకుసైతం లక్షన్నర రూపాయల అప్పును ముట్ట చెప్పడం గులాబీ దళానికే చెల్లుతుందన్నారు. బందిపోటుల పాలనతో, గులాబీ దండుపాళ్యం బ్యాచ్ దాడులతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా కమలానికి పట్టంగట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారని గజ్జల యోగానంద్ ధీమాను వ్యక్తంచేశారు. ఈ మధ్యకాలంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బిజెపికి లభిస్తున్న ఆదరణనుచూసి గులాబీ దండు గుండెలు బాదుకుంటున్నారని, 2023 తో అధికారం కోల్పోయి ప్రజలను ఎలా వంచించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి అనే భయంపట్టుకొని బిజెపి కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కెసిఆర్ అండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని వెర్రి వేషాలు వేసినా ప్రజలు చీకుడుతున్నారని, రాజకీయంగా తన్ని తరిమేసేదొక్కటే ఇక మిగిలిందన్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి అధ్యక్షులు రాజుశెట్టి కురుమ అధ్యక్షతన యువ నాయకులు గట్టుపల్లి కిరణ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువత, పలు పార్టీల కార్యకర్తలు బిజెపిలో చేరగా వారందరికీ గజ్జల యోగానంద్ పార్టీ కండువానుకప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారంతా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా, బిజెపి పూర్వ వైభవం మరింత ఇనుమడింప చేసేలా కంకణ బద్ధులై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు భీమని విజయలక్ష్మి, డివిజన్ ప్రధాన కార్యదర్శిలు చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, సత్య కురుమ, సిహెచ్ బాలరాజు, ఆకుల సందీప్, బాపుజీ, కిషోర్, దిలీప్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.