తెలంగాణ ప్రభుత్వానిది ఓవర్‌ యాక్షన్‌


దమ్ముంటే వైకాపా ఎదురుగా పోరాడాలి
ఎపి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు
గుంటూరు,మార్చి5(జ‌నంసాక్షి):  దమ్ముంటే వైసిపి నాయకులు ఎదురుగా వచ్చి పోరాడాలని స్పీకర్‌ కోడెల సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని స్పీకర్‌ ఆరోపించారు. మంగళవారం ఉదయం గుంటూరులో స్పీకర్‌ కోడెల విూడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ లో సైబర్‌ కైమ్ర్‌ డేటా చోరీ జరిగిందన్నారు. టిడిపికి సంబంధించిన డేటా పోయిందని వైసిపి వాళ్లు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా, అనైతికమైన చర్యగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించడం అనైతికమైన చర్య అని పేర్కొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోనే 15 వందల ఓట్లు తొలగించారని తెలిపారు. 83 నుండి రాజకీయాల్లో తాను ఉన్నానని, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తుని ఘటన, అధికారులపై దాడులు చేయడం చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదంటూ ఆవేదన చెందారు. స్పీకర్‌గా తన విూద అనేక చౌకబారు, నీచమైన, అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. దమ్ముంటే వైసిపి నాయకులు ఎదురుగా వచ్చి పోరాడాలని సవాల్‌ విసిరారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అరాచకాలు చేస్తారో అనిపిస్తుందన్నారు. ప్రజలు, అధికారులు, రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పికె సలహ మేరకే ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీ కోసం చివరివరకు పోరాడతానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పోటీ చేస్తానన్నారు. వైసిపికి టిఆర్‌ఎస్‌, బిజెపిలు తొత్తులుగా మారాయని, గతంలో జగన్‌ ను విమర్శించిన టిఆర్‌ఎస్‌, బిజెపిలు నేడు జగన్‌ పల్లకి మోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రం, వైసిపి కి సంబంధించినది కాదని…. అలాంటిది వైసిపి తెలంగాణకు ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దీని పై ఓవర్‌ యాక్షన్‌ చేయడం ఏంటి అని స్పీకర్‌ కోడెల నిప్పులు చెరిగారు.