తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 అనేది ఒక విశిష్టమైన రోజు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 అనేది ఒక విశిష్టమైన రోజని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేదిక పై నుండి మంత్రి తన సందేశాన్ని అందించారు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 76సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవమును ఘనంగా జరుపుకుంటున్నాం.
భారతదేశం ఈ రోజు కన్పిస్తున్న పరిపాలన స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్ర్యం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేది. బ్రిటీష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్ ఇండియా ఒక భాగం. స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి. దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం. భారతదేశంలో ఐక్యమై సంవత్సరాలు పూర్తయ్యాయి. భారతదేశ నిర్మాణంలో నేటితో 76 తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును జాతీయ సమైక్యతా దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం.
తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభికం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, ముగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం.
జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య సమైక్యత. విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అన్నారు.

76 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము రూపుదాల్చింది. స్వరాష్ట్రము సాదించుకున్న తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుభీమా, రైతు రుణమాఫీ, రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, కంటివెలుగు, కేసీఆర్ కిట్లు, డబుల్ బెడ్ రూము ఇండ్లు, గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, శాదిముబారక్, దళిత బందు వంటి విన్నుత్నమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి అమలు చేయడం జరుగుతున్నది.
వైద్య విద్యకు సంబంధించి ఈనెల 15వ తేదీన ఒకేసారి 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడం జరిగింది, ఈ దశాబ్ద కాలంలో నూతనంగా 21 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు అందని ద్రాక్షగా భావించిన వైద్యవిద్య నేడు తెలంగాణ విద్యార్థులకు అతి చేరువగా వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య విద్యలో సీట్ల సంఖ్య 2850 నుండి 8,515కు పెరిగింది. దేశ వైద్యరంగంలో ఇది నవీన చరిత్ర తెలంగాణలో తెల్లకోటు విప్లవం, మన దేశంలో త్రాగునీరు సాగునీటి కోసం దశాబ్దాలుగా పరితపిస్తున్న ప్రాంతాల్లో పాలమూరు జిల్లా వలసల జిల్లాగా పేరుగాంచింది స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా రూపురేఖలే మారిపోయాయి కేసీఆర్ గారి నాయకత్వములో ప్రపంచములోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచపు అతి భారీ మోటార్లతో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు యాభై వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా శ్రీశైలం నుండి కృష్ణా జలాలను ఎత్తిపోసి మొదటి దశలో 70 మండలాలలోని 1226 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది . అలాగే రెండో దశలో 6 జిల్లాల్లోని 19 నియోజికవర్గాలలో 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ప్రాజెక్టులో 5 లిఫ్ట్ దశలు ఉన్నాయి. నీటిని నిల్వ చేయడానికి 67.52 టియంసిల నిల్వ సామర్థ్యం గల 6 రిజర్వాయర్లను నిర్మించడం జరుగుతుంది. ఈ పథకంలో ప్రపంచంలోనే అతిభారీ మోటార్లను ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్ధ్యం గల 31 బాహుబలి పంపులను 75 మెగావాట్ల సామర్థ్యం గల 3పంపులను వాడడం జరిగిందన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్వర్క్ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం. అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్టిక్ పాయింట్ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం. కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్వాటర్ నుంచి తొలుత ఓపెన్ అప్రోచ్ కెనాల్ ద్వారా నార్లాపూర్ హెడ్ రెగ్యులేటర్కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్ సర్జీపుల్ తీసుకెళ్తారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేసిన వాటర్ కండక్టర్ సిస్టమ్ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం. ప్రధాన ఓపెన్ కెనాల్ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసి సిస్టర్నల్ లు, సబ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి.
మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్ హౌస్లు, సర్జ్ పూల్స్ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం, ఒక్కో సర్జ్ పూల్ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్ హౌస్ లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్ ద్వారా సగటున కిలో మీటర్ వరకు ప్రయాణించాల్సి ఉంది.

ఒకటి నుండి పదో తరగతి వరకు సర్కార్ బడి పిల్లలకు అల్పాహారం అందించే విన్నూత్న పథకానికి వచ్చే దసరా నుండి శ్రీకారం చుట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 29వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 22లక్షలకు పైగా విద్యార్ధులు లబ్ది పొందుతారని తెలియచేసారు.
అనంతరం విద్యార్థులు చూపరులను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా సాంస్కృతిక నృత్యాలు చేశారు.
పాలమూరు జిల్లాకు వరప్రదాయని అయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సాధన, నిర్మాణంలో విశేషంగా కృషి చేసినందుకు రాష్ట్ర మంత్రి నీ జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ శాలువా, పుష్ప గుచ్చాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి, అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గ్రంధాలయ చైర్మన్ లక్ష్మయ్య, గొర్ల కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కృముర్తి యాదవ్, జిల్లా అధికారులు, స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కలెక్టరేట్ సిబ్బంది , కళాకారులు, చిన్నారులు పాల్గొన్నారు.