మరో యువతితో భర్త వివాహేతర సంబంధం
,సెప్టెంబర్02,(జనం సాక్షి)వరకట్న వేధింపులతోఆత్మహత్య ఘటనలు ఇటీవలే పెరిగిపోయాయి. అధిక కట్నం కోసం వేధింపులు తాళలేక ఇటీవలే నోయిడా, బెంగళూరు నగరాల్లో గర్భిణిలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. డౌరీ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న పూజశ్రీ అనే 28 ఏండ్ల యువతికి నందీష్ అనే వ్యక్తితో మూడేండ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ పాప కూడా ఉంది. వీరు బగలగుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని సిదేహళ్లిలో నివాసం ఉంటున్నారు. అయితే, పెళ్లైన తర్వాత నుంచి భర్త అధిక కట్నం కోసం పూజశ్రీని వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక పూజశ్రీ ఈ నెల 1వ తేదీన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు నందీష్ వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పూజశ్రీ తల్లి ఆరోపించింది. తన బిడ్డను నిరంతరం హింసించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘రూ.30 లక్షలు అప్పు చేసి బిడ్డకు పెళ్లి చేశాను. అప్పటి నుంచి పూజను నందీష్ హింసించేవాడు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. భర్త వేధింపులు తాళలేక పూజ పుట్టింటికి వచ్చింది. చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఓ రోజు పూజను జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసు స్టేషన్‌లో హామీ ఇచ్చాడు. అయినా వేధింపులు ఆగలేదు. పూజ మరణించిన రోజు ఉదయం 7:15 గంటల ప్రాంతంలో ఆమెను మా ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 8:20 గంటలకు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పాడు. ఇదంతా అతని అక్రమ సంబంధం వల్లే జరిగింది. వాళ్లు నాబిడ్డను చంపేశారు’ అంటూ పూజ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.
పూజశ్రీ అమ్మమ్మ మాట్లాడుతూ.. ‘నందీష్ మా కుటుంబాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇల్లు కావాలని డిమాండ్ చేశాడు. మేము బంగారు ఆభరణాలు ఇచ్చాము. కానీ పూజను నిత్యం హింసించేవాడు. అతనికి వివాహేతర సంబంధం కూడా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు బగలగుంటె పోలీసులు వరకట్న వేధింపుల ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.