యూరియా సరఫరాలో గందరగోళం

 

 

 

 

 

సెప్టెంబర్02,(జనం సాక్షి) కాంగ్రెస్‌ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రోజంతా పడుగాపులు పడాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఎండకు ఎండుతు, వానకు తడుస్తూ యూరియా కోసం బారులు తీరుతున్నారు. తాజాగా జనగామ జిల్లా ఘన్‌పూర్‌లో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాప్ల వద్దకు, గోదాముల వద్దకు పరుగులు తీస్తున్నారు. బుధవారం మండలంలోని శివునిపల్లి ఆగ్రోస్ -2 ఫర్టిలైజర్ షాపు వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు ఉదయం 6 గంటల నుండే షాపుల వద్దకు చేరుకొని లైన్లు కట్టారు. ఉదయం10 దాటిన రైతులకు యూరియా అందించకపోవడంతో లైన్‌లో రైతులు తోసుకోవడంతో పాటు, కొట్టుకునే పరిస్థితి నెలకొంది.

షాపుల వద్ద లైన్లు కట్టిన రైతులకు గోదాం వద్ద ఇస్తామని ఒకసారి, షాపు వద్ద ఇస్తామని మరొకసారి చెప్పడంతో రైతులు అటు, ఇటు పరుగులు తీస్తున్నారు. రోజుల తరబడి ఫర్టిలైజర్ షాపుల వద్ద గంటల కొద్ది పడికాబులు కాసిన రైతులకు యూరియా దొరకడం లేదు. వ్యవసాయం చేయడానికి రైతులకు ఓపిక, అనుభవంతో పాటు రన్నింగ్ కూడా వచ్చి ఉంటేనే వ్యవసాయానికి కావాల్సిన యూరియా వంటివి సాధించి సాగు చేసే పరిస్థితి నెలకొంది.

యూరియా కోసం రైతులు గంటల కొద్ది తిండి, తిప్పలు లేకుండా లైన్లో నిలబడి అక్కడే అన్నం తింటూ, మరికొన్ని చోట్ల రైతులు సొమ్మసిల్లి పడిపోతున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో యూరియా సమస్య పరిష్కారం కావడం లేదు. కాలం అయితదో కాదు అని, పండిన పంట చేతికి వస్తదో రాదో అని, చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని వ్యవసాయదారులు ఇన్ని రకాలుగా ఆందోళన చెందితుంటే, ఇవన్నీ సరిపోవునట్లుగా ప్రభుత్వం ఇచ్చే ఒక యూరియా బస్తాకు వారం రోజులుగా ఇక్కడ లైన్లు కట్టడం ఇదేం గోస మాకు, భూమి నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నందుకా, యూరియా కోసం మేము ఇంత ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, మోడీ ఏం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.