తెలంగాణ రాష్ట్ర సాధనలో కలాల గళాల పాత్ర కీలకం మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆదివారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో తెలంగాణ సారస్వత పరిషత్ రూపొందించిన వనపర్తి జిల్లా సమగ్ర స్వరూపం ‘‘వనపర్తి జిల్లా వైభవం’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుండే సాహిత్యం పాత్ర గొప్పదని, కాలాన్ని ముందే పసిగట్టి హెచ్చరిక చేసే వారు కవులని, ఒక పుస్తకాన్ని ఒక వ్యాఖ్యలో చెప్పే ఘనత ఒక కవికి మాత్రమే సాధ్యమవుతుందని ఆయన సూచించారు. కవిత్వానికి ఉండే పదును, శక్తి మరి దేనికీ ఉండదని, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన కవిత్వం ప్రజలను కదిలించిందని, ఆయా ప్రాంతాల ప్రజల ఆలోచనలు, అలవాట్లను బట్టి సాహిత్యం ఉంటుందని ఆయన అన్నారు. బెంగాల్, పంజాబ్, లక్నో, తెలంగాణ వంటి ప్రాంతాల్లో మాత్రమే ప్రజలను కదిలించే సాహిత్యం వచ్చిందని, ఆధిపత్యం కోసం ప్రపంచంలో యుద్దాలు జరిగాయని, వాటి వల్ల అద్భుతమైన సాహిత్యం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రపంచంలో అతి ఎక్కువ గ్రంథాలు చదివింది కారల్ మార్క్స్, ఆ తర్వాత స్థానం ఎక్కువ పుస్తకాలు చదివింది అంబేద్కర్, ఆయన విశ్వ మానవుడు అని ఆయన అన్నారు. నాటి సురవరం ఆంధ్రుల సాంఫీుక చరిత్ర, నేటి సారస్వత పరిషత్ 33 జిల్లాల సమగ్ర పుస్తకాలు, నాటి ` నేటి ప్రజల జీవితాలకు అద్దం పడతాయని ఆయన తెలిపారు. పరిశోధకులు, పోటీ పరీక్షల విద్యార్థులకు ఈ జిల్లాల సమగ్ర స్వరూప పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయని, జిల్లాల చరిత్రను నిక్షిప్తం చేయడం అభినందనీయమని ఆయన సూచించారు. వనపర్తి జిల్లాను గ్రంథస్తం చేయడం చరిత్రలో నిలుస్తుందని, ఆయా జిల్లాల ప్రముఖులు, సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మిక క్షేత్రాలను గ్రంథస్తం చేశారని, రాష్ట్ర వ్యాపితంగా అన్ని గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జిల్లాల సమగ్ర స్వరూపం పుస్తకాలు ఉండేలా చూస్తానని ఆయన తెలిపారు. పుస్తక పఠనం అలవాటు చేసుకోవటం ద్వారా మేధస్సు పెరుగుతుందని, ఎన్నో కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం పొందవచ్చునని ఆయన సూచించారు. ఎం.పీ. రాములు మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నదని, సురవరం ప్రతాపరెడ్డి ఈ జిల్లాకు చెందిన వాడు కావడం గర్వకారణం అన్నారు. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ కొత్తతరం వారికి చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి గురించి అందరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ 33 జిల్లాల చరిత్ర తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమని, అలాగే వనపర్తి జిల్లా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా పేరుగాంచిందని, ప్రతి ఒక్కరూ వనపర్తి జిల్లా చరిత్ర గురించి తెలుసుకోవాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని రచించిన వారికి అభినందనలు తెలిపారు. అంతకుముందు వనపర్తి జిల్లా కవులచే కవి సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా 40 మంది కవులకు మంత్రి చేతుల విూదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సారస్వత పరిషత్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఎం.పీ. రాములు, ఎస్పీ అపూర్వ రావు, జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, గ్రంధాలయ ఛైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వకిటి శ్రీధర్, సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య, కోశాధికారి రామారావు, కవులు, రచయితలు, సాహితీ వేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.