తెలుగు తప్పనిసరి

– ఉర్దూ ఆప్షనల్‌ సబ్జెక్టు

– 1 నుంచి 12 తరగతి వరకు తెలుగు ఖచ్చితంగా బోధించండి

– ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):ప్రపంచ తెలుగు మహాసభలు మరోమారు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో నిర్వహించాలకున్న సభలను వివిధ కారణాల వల్ల డిసెంబర్‌లో జరపాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభలో నిర్వహణపై హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సవిూక్ష జరిపారు. అక్టోబర్‌ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే, అక్టోబర్‌ 5 నుంచి 9వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్‌ లోనే జరుగుతున్నది. నవంబర్‌ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కు కూడా హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగమంతా తలమునకలై ఉంటారు. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే, అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రెండు ప్రపంచ సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబర్‌ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సాహిత్య అకాడవిూకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడవిూ నోడల్‌ ఏజన్సీగా పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్‌ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడవిూని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వెంటనే సిలబస్‌ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని చెప్పారు. సాహిత్య అకాడవిూ రూపొందించిన సిలబస్‌ నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని కూడా సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించడం, సాహిత్య అకాడవిూ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ నే బోధించడం విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ బోర్డులను ఖచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అన్ని రకాల బోర్డుల పైన స్పష్టంగా తెలుగులో రాయాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టం చేశారు. రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడవిూ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌ రావు, గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ సత్యనారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.