తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 315 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొమ్మిది పరుగులకే ఓపెనర్‌ దిల్షాన్‌ వికెట్‌ నష్టపోయిన లంకను సంగక్కరా ఆదుకున్నాడు. తరంగ, పెరీరాలతో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి శ్రీలంకను లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. ఓ దశలో విజయం దిశగా పయనించినట్టు కన్పించిన లంకను ఉమేశ్‌ యాదవ్‌ దెబ్బతీశాడు. 47వ ఓవర్లో సంగక్కరను ఔట్‌ చేయడంతో లంక ఓటమి ఖాయమైంది. దీంతో శ్రీలంక 50 ఓవర్లలో 293 పరుగులు మాత్రమే చేయగల్గింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న భారత్‌ తడబడుతూనే తన ఇన్నింగ్స్‌ ఆరంభించింది. 7 పరుగులకే ఓపెనర్‌ గంభీర్‌ వికెట్‌ను కోల్పోయింది. దీంతో కోహ్లితో కలిసి డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 180 పరుగుల వద్ద సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ వెంటవెంటనే అవుటైనప్పటికీ రైనాతో కలిసి కోహ్లీ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్‌ 40వ ఓవర్లో 113 బంతుల్లో నాలుగు ఫోర్లతో 106 పరుగులు చేసి అవుటయ్యాడు. చివర్లో రైనా, కెప్టెన్‌ ధోని మెరుపులు మెరిపించారు. రైనా 45 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగుల చేయగా, ధోని 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత బౌలర్లలో పఠాన్‌, యాదవ్‌, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు తీయగా, లంక బౌలర్లలో పెరీరా 3, కులశేఖర, మాథ్యూస్‌లు తలో వికెట్‌ తీశారు. కాగా లంక బౌలర్‌ మలింగను భారత్‌ బ్యాట్స్‌మెన్‌ ఓ ఆటాడుకున్నారు. దీంతో 10 ఓవర్లు వేసిన మలింగ 83 పరుగులు సమర్పించుకున్నాడు