దగ్గుబాటికి పదవులంటే పరమాన్నం

– పదవులకోసం ఎన్నిపార్టీలైనా మారతాడు
– కొడుక్కి పర్చూరి టికెట్‌ కోసమే జగన్‌పై పొగడ్తలు
– జైలుకెళ్లిన జగన్‌ మంచివాడు.. నిర్దోషిగా తేలిన బాబుపై విమర్శలా?
– చంద్రబాబుపై నోరుజారితే చూస్తూ ఊరుకోం
– టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
గుంటూరు, జనవరి28(జ‌నంసాక్షి) : దగ్గుబాటి కుటుంబానికి పదవులంటే పరమాన్నమని, పదవుల కోసం వారు ఎంతకైనా దిగజారి, ఎన్ని పార్టీలైనా మారుతారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాజకీయ స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి.. చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.  బావొక పార్టీ, బావమరిది ఒక పార్టీ చూశామని, కానీ భార్య ఒక పార్టీ, భర్తొక పార్టీలో ఉండడాన్ని ఏపీలో దగ్గుబాటి కుటుంబాన్నే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు వైసీపీలో ఉంటామని వెంకటేశ్వరరావు చెప్పడాన్ని బుద్దా తప్పుపట్టారు. అంటే ఇది బీజేపీ, వైసీపీ జాయింట్‌ వెంచర్‌గా అర్థమవుతోందని ఆయన విమర్శించారు. జగన్‌ తన కేసుల మాఫీ కోసం మోదీ కాళ్ల దగ్గర చేరారని, మోదీ, జగన్‌ ఒకేటేనని తాము ఏడాది కాలంగా చెబుతున్నామని వెంకన్న అన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌.. జగన్‌ను కలవడం, నిన్న విజయసాయి రెడ్డి స్వయంగా దగ్గుబాటి కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని జగన్‌ వద్దకు తీసుకువచ్చారని ఆయన అన్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. జగన్‌కు దగ్గుబాటి కుటుంబం క్లీన్‌ చిట్‌ ఇవ్వడం..
రెండేళ్ల నుంచి జగన్‌ను గమనిస్తున్నామని, ఆయన నాయకత్వ లక్షణాలు బాగుండబట్టే వైసీపీలో చేరుతున్నట్లు వెంకటేశ్వరరావు ప్రకటించడం హాస్యాస్పదమని బుద్దా వెంకన్న అన్నారు. జగన్‌ నాయకత్వ లక్షణాలు ఏం బాగున్నాయో చెప్పాలని దగ్గుబాటిని డిమాండ్‌ చేశారు. జగన్‌ పథకాలు కాపీ కొట్టాల్సిన ఖర్మ తమకు లేదని, దగ్గుబాటి నోటికొట్టినట్లు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని వెంకన్న హితవు పలికారు. పరిపాల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ ఒకేగూటి పక్షులని తేలిపోయిందన్నారు. జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోపాయికారి ఒప్పందం చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దగ్గుబాటి తన కొడుక్కి పర్చూరు టికెట్‌ ఇప్పించేందుకే జగన్‌పై పొగడ్తలు కురిపించారని బుద్దా వెంకన్న విమర్శించారు.
చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం..
ఏడాదికిపైగా జైల్లో ఉన్న వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అని, రూ.43 వేల కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని, జైలుకు వెళ్లిన జగన్‌ విూకు మంచివాడు.. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో వేసిన 11 ఎంక్వైరిలలో నిర్దోషిగా తేలిన చంద్రబాబు విూకు చెడ్డవాడు ఎలా అయ్యారని బుద్దా ప్రశ్నించారు. అవినీతిపరులు విూకు మంచివాళ్లా. విూరు విూ ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి. అంతే కానీ ప్రజల కోసం పనిచేస్తున్న నిజాయితీపరుడైన చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.