దమ్ముంటే నాపై.. ఆరోపణలను నిరూపించండి
– జగన్, పవన్‌లకు విమర్శించడమే తెలుసు
– దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు తెదేపాకున్నారు
– వారి సంక్షేమానికే తొలి ప్రాధాన్యతనిస్తాం
– ఏపీ మంత్రి నారా లోకేశ్
విజయవాడ, అక్టోబర్20(జనంసాక్షి) : జగన్, పవన్‌లు ఒక్కటై టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం విజయవాడలోని ఆటోనగర్‌లో ఎకరా స్థలంలో నిర్మించనున్న తెదేపా జిల్లా కార్యాలయానికి లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..
దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు తెదేపాకు ఉన్నారని లోకేశ్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్నో విధాలుగా హింసించినా.. నమ్ముకున్న జెండాను విడిచిపెట్టని కార్యకర్తలే తెదేపా బలమని వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు పాలకులు 672మంది కార్యకర్తలను చంపారని, పరిటాల రవీంద్రను కుడా పార్టీ కార్యాలయంలో హత్య చేశాని, కార్యకర్తలను హింసించి.. లొంగకపోతే అంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసం రూ.23 కోట్లు, ప్రమాద బీమా కోసం రూ.63 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని లోకేష్ అన్నారు. పార్టీ పెట్టి 30ఏళ్లవుతున్నా కొన్ని జిల్లాల్లో ఇంకా అద్దె భవనాల్లోనే పార్టీ కార్యాలయాలు నడుస్తున్నాయన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే.. 2019 ఎన్నికల ప్రచారం ఇక్కడ నుంచే ప్రారంభించవచ్చని లోకేష్ తెలిపారు. ఎన్నో కేసుల్లో నిందితుడైన వ్యక్తి.. తనపై ఆరోపణలు చేస్తున్నారని వైకాపా అధినేత జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని జగన్‌కు సవాలు విసిరారు. పొరుగు జిల్లాలోనే పాదయాత్ర చేస్తూ.. కనీసం శ్రీకాకుళం జిల్లాలో తుపాను కల్లోలిత ప్రాంతాలవైపు జగన్ కన్నెత్తి చూడలేదని గుర్తుచేశారు. తుపాను వచ్చిన ఏడు రోజులకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్.. ఏవో విమర్శలు చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు నేతలు ప్రజలకు సేవ చేయకపోవడమే కాక.. చేస్తున్న వారిని విమర్శిస్తారని దుయ్యబట్టారు. తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయని తెలిపారు. 35మంది ఐఏఎస్ అధికారులు, 200 మంది డిప్యూటీ కలెక్టర్లు బాధితుల కోసం అహర్నిశలు పని చేస్తున్నారని అన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణరావు, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.–