దళితబంధుకు మరో 200కోట్లు
మొత్తం 1200కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్,అగస్టు24(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అడిగని వారిదే పాపం అన్నట్లు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏదో ఒక లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎక్కడెక్కడి నిధులన్నీ తెచ్చి హుజూరాబాద్ లో వరదలా పారిస్తోంది. తనకు దూరమైన దళిత వర్గాల వారిని అక్కున చేర్చుకునేందుకు దళితబంధు పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా తొలుత హుజూరాబాద్ ని ఎంపిక చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. దళిత బంధు ప్రారంభం రోజున కేవలం 15 , 20 మందికే దళితబంధు సహాయం అందించడంపై ప్రతిపక్షాలు, దళితులు సైతం ఒకింత అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేయడంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తాజాగా మంగళవారం మరో 200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో కలిపి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల మొత్తం రూ.1200 కోట్లకు
చేరుకుంది. దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే దళిత బంధు పథకానికి ప్రభుత్వం తొలి విడత రూ. 500 కోట్లు విడుదల చేసింది. సోమవారం రెండో విడతలో మరో రూ. 500 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇవాళ మరో 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ పథకానికి ఇప్పటివరకు రూ. 1200 కోట్లు కేటాయించినట్లయ్యింది. పథకం అమలుకు రూ. 2 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభా వేదికగా ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దళిత ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సైతం దళితబంధు వర్తింపజేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.