దళిత బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
హర్యానా, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్‌ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం బలైంది. 16 ఏళ్ల దళిత బాలికను ఎనిమిది మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణం ఈ నెల 9న జరగగా, పది రోజులు ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ యువకులు ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆ బాలిక కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. చివరకు విషయం బయటకు వచ్చి ఊరంతా గుప్పుమంది. దీంతో బాలిక తండ్రి సహాయం కోసం పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు కోపోద్రిక్తులైన గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించడంతో చివరకు పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. దీనిపై హిసార్‌ ఎస్పీ సతీష్‌ బలాన్‌ మాట్లాడుతూ తన కూతురు సామూహిక అత్యాచారానికి గురైందని తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని, కాని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య కేసు నమోదు కాలేదని తెలిపారు.