దసరా ఉత్సవాలకు..  ముస్తాబైన ఇంద్రకీలాద్రి


– నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
– ఒక్కోరోజు ఒక్కోరూపంలో దర్శనమివ్వనున్న అమ్మవారు
– 15లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
– ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు
విజయవాడ, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : దసరా మ¬త్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అందంగా ముస్తాబైంది. దుర్గా మల్లేశ్వరస్వామి సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అక్టోబర్‌ 10 నుంచి 18 వరకూ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాత మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతి రూపంలో జగన్మాత భక్తులను అనుగ్రహించనుంది.
విజయ దశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా అలంకారుభూషితమై దుర్గాదేవి భక్తులను అనుగ్రహిస్తారు.
దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది సుమారు 15లక్షల మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఆశ్వయుజ మాసం తొలి రోజు అంటే బుధవారం ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక మరుసటి రోజు నుంచి ఉదయం 3 గంటలకే దర్శనం ప్రారంభించి రాత్రి 11 వరకు అవకాశం కల్పిస్తారు. అక్టోబరు 14న ఆదివారం మూలా నక్షత్రం రోజున రాత్రి 1 గంట నుంచే దర్శనానికి అనుమతిస్తారు. దసరా రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మహిషాసురమర్దినిగా, మధ్యాహ్నం 1 గంట నుంచి రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల్లో భద్రత కోసం 5,400 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదానంతోపాటు ఉచితంగా పులి¬ర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు. అర్జునవీధిలోని శృంగేరి సత్రం, బాలభవన్‌ వద్ద ఉదయం 10 గంటల నుంచే అన్నప్రసాదం వితరణ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి పెరుగు, సాంబారన్నం అందజేస్తారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు, పులి¬ర విక్రయించాలని నిర్ణయించారు.
నవరాత్రులకు దుర్గగుడి సిద్ధం – ఈవో కోటేశ్వరమ్మ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమైందని, ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది భవానీ సేవాదళ్‌ పేరుతో 500 మంది పోలీసులు…వృద్ధులు, వికలాంగులకు సేవలందించనున్నట్లు చెప్పారు. అన్ని క్యూలైన్లను ఏర్పాటు చేశామని, అమ్మవారి ప్రసాదాలు భక్తులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మ ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నామన్నారు. గత ఏడాదిలాగే వీఐపీల కోసం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగకుండా నిర్దేశించిన సమయంలోనే వీఐపీలు అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా ఈవో విజ్ఞప్తి చేశారు. కొండపైకి వచ్చేందుకు బస్సులను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విశిష్టమైన మూలానక్షత్రం రోజున తెల్లవారుజామునే కాకుండా ఏ సమయంలో వచ్చినా అమ్మవారి ఆశీస్సులు పొందుతారని భక్తులకు ఈవో కోటేశ్వరమ్మ తెలియజేశారు.

తాజావార్తలు